యాచకులకు డబ్బులు ఇవ్వొద్దు.. ఆహారాన్ని మాత్రమే అందించండి

యాచకులకు డబ్బులు ఇవ్వొద్దు.. ఆహారాన్ని మాత్రమే అందించండి

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రైన్లలో లేదా వీధి వీధి తిరుగుతూ కొంతమంది బిచ్చమెత్తుకుంటూ ఉంటారు, ఇది పూర్తిగా వ్యాపార ధోరణితోనే సాగుతుంది. ఇందులో చిన్నారులను తీసుకొచ్చి వారి బాల్యం నుంచే అడుక్కోవడం నేర్పిస్తుంటారు. వారి బాల్యంతో పాటు ఇతర జీవితం భిక్షాటనలోనే గడిచిపోతుంది. వీరిలో ఎక్కువ మంది గంజాయి, డ్రగ్స్, మద్యానికి బానిసలుగా మారుతున్నారు. పని చేయడానికి బద్దకించే వాళ్ళు మాత్రమే భిక్షాటన చేస్తారు. అయితే, అన్ని రకాలుగా బాగున్నా కూడా భిక్షాటన చేసేవారు కూడా ఉన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరాల్లో భిక్షాటన చేస్తారు. మరికొందరు ఇతర రాష్ట్రాల నుంచి వృద్ధులను, వికలాంగులను తీసుకువచ్చి వాళ్ళతో  భిక్షాటన చేయిస్తుంటారు. ఆదరణ కరువైన వాళ్లు, కుటుంబ కలహాల వలన లేదా ఇతర కారణాల వలన ఇంట్లో నుంచి వచ్చేసినవాళ్లు నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు, వీరికి ఎక్కడ ఉండాలో తెలియక రోడ్ల పక్కన ఫుట్ పాత్​ల మీద చెట్ల కింద, అవకాశం ఉన్నచోట ఆశ్రయం పొందుతుంటారు.

కాగా, సంచార జాతులవారికి ఒక ప్రాంతం అంటూ ఉండదు. వలసలతోనే జీవితం గడిపేస్తారు, నెలకు, మూడు నెలలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళిపోతారు, చిన్న చిన్న చేతివృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ తిరుగుతుంటారు. వీరు బిక్షగాళ్లు కాదు. బిక్షగాళ్లకు ఆకలి తీర్చండి. కానీ డబ్బులు ఇవ్వకండి. మీరు ఇచ్చే డబ్బులతో మద్యం తాగడం, గుట్కాలను, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సేవిస్తూ ఉంటారు, ఆ మత్తులో వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులలో అరాచకమైన పనులు కూడా చేస్తుంటారు.

మీరు సహృదయంతో, దయతో సహాయం చేసే డబ్బులు మంచికి వినియోగం కాకుండా పోతున్నాయి. మీరు ఇవ్వాలి అనుకుంటే ఆహారాన్ని మాత్రమే అందించండి, ఆహారం ఒక్కటే చాలు అనేది, ఆహారం ఇవ్వడానికి కుదరకపోతే, బిస్కెట్స్, లేదా పండ్లు ఏది తోస్తే అది ఇవ్వండి, ఏది ఇచ్చినా వారి ఆకలి తీరుతుంది.. మీకు కావలసింది సహాయం చేయడం. ఒక్క క్షణం ఆలోచించండి.

డాక్టర్ వై సంజీవ కుమార్