- 50 మందికి గాయాలు.. నుజ్జునుజ్జయిన 17 వాహనాలు
 - మద్యం మత్తులో డ్రైవింగ్తో ఘోరం.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
 
జైపూర్: రాజస్తాన్ లో 24 గంటల వ్యవధిలోనే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో రోడ్డుపై 5 కి.మీ. మేర అడ్డొచ్చిన వాహనాలన్నింటినీ గుద్దుకుంటూ వెళ్లిపోయాడు. సోమవారం మధ్యాహ్నం జైపూర్ లోహమండి రోడ్డుపై జరిగిన ఈ ఘటనలో 19 మంది చనిపోగా.. 50 మంది గాయపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ట్రక్కును స్పీడ్ గా నడుపుతూ కంట్రోల్ తప్పాడు.
బ్రేక్ వేయకుండా 5 కి.మీ. వరకు కార్లు, బైక్‌లతో సహా పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయాడు. చివరికి ఓ కారును బలంగా ఢీకొట్టి, మరో మూడు వాహనాలపై బోల్తా పడటంతో ట్రక్ ఆగింది. ఈ ప్రమాదంలో 17 వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని  నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున  ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం రాత్రి ఫలోది జిల్లాలో టూరిస్ట్ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఆ ఘటనలో 18 మంది యాత్రికులు మృతి చెందారు.
