- ఎమ్మెల్యే మదన్మోహన్రావు
 
లింగంపేట, వెలుగు : పేదలకు ఇండ్లు లేక రేకులషెడ్లు, పూరి గుడిసెల్లో చూసి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 30వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. సోమవారం మండలంలోని మోతె గ్రామంలో తాల్ల శివ్వయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లనిర్మాణాల్లో జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ముందు వరుసలో ఉంచినందుకు అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. నియోజకవర్గం నలభై ఏండ్లుగా అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయించామన్నారు.
రూ.2 వందల కోట్లతో మోతె శివారులో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించినట్లు చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మోతె గ్రామానికి మొదటి విడతలో 34 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు. మరో 50 ఇండ్లు మంజూరు చేయాలని మాజీ జడ్పీటీసీ సంతోష్‌రెడ్డి కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. మోతె తండాకు వెళ్లే రహదారి వర్షాలకు కొట్టుకపోయిందని, వచ్చే బడ్జెట్లో రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం లింగంపేటలోని మహాత్మాజ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను ఎమ్మెల్యే మదన్మోహన్రావు సోమవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న బోజనం చేస్తున్న స్టూడెంట్ల వద్దకు వెళ్లి ఎమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. హాజరు రిజిస్ట్రర్‌ను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, సమన్వయ కమిటీ సభ్యులు అట్టెం శ్రీనివాస్, సాయికుమార్, నాయకులు ఏలేటి సంతోష్‌రెడ్డి, రామిరెడ్డి, అబ్దుల్‌వాహబ్ గోనెలింగం తదితరులు ఉన్నారు.
