నవంబర్ 25న GHMC చివరి కౌన్సిల్ సమావేశం!

నవంబర్ 25న GHMC చివరి కౌన్సిల్ సమావేశం!
  • ఐదేండ్ల పనులు, బడ్జెట్ రూపకల్పన చర్చ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ నెల 25న జరగనుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడంతో కోడ్ ముగిసిన తరువాత కౌన్సిల్ నిర్వహించాలని ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిర్ణయించారు. కౌన్సిల్ మీటింగ్ కోసం కార్పొరేటర్ల నుంచి బల్దియా అధికారులు  ప్రశ్నలను స్వీకరిస్తున్నారు. ప్రస్తుత కౌన్సిల్​కు ఈ సమావేశం చివరది అయ్యే అవకాశముంది. 2021 ఫిబ్రవరి11న కొలువుదీరిన ఈ కౌన్సిల్ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో  ముగియనుంది. అయితే బడ్జెట్ సమావేశం ఫిబ్రవరి 10లోపు జరిగితే ఈ కౌన్సిల్ బడ్జెట్​కు ఆమోదించే అవకాశముంది. లేదంటే మళ్లీ ఎన్నికలు జరిగితే కొత్తగా ఏర్పడే కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంటుంది.

 కాగా, 25న జరిగే  సమావేశంలో గడిచిన ఐదేండ్లలో చేసిన పనులపై చర్చించే అవకాశముంది. హెచ్ సిటీ పనులు, ఎస్ఆర్డీపీ పనులు, దశాబ్దాలుగా వివాదంగా మారిన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని మూడు విగ్రహాల  పంచాదీతో పాటు స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలు, ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈ సారి బతుకమ్మకు గిన్నీస్ రికార్డు ఆఫ్ వరల్డ్ లో స్థానం దక్కడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో 2026–27 ఆర్థి సంవత్సరానికి  సంబంధించిన వార్షిక బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.