రీ సేల్ ఇండ్లకు మస్తు డిమాండ్

రీ సేల్ ఇండ్లకు మస్తు డిమాండ్
  • రూ.35 లక్షల లోపు వాటిపై జనాల ఇంట్రెస్ట్ 
  • శివారు ప్రాంతాల్లోని వాటికి సైతం గిరాకీ

హైదరాబాద్, వెలుగు : సిటీలో ఇల్లు  కొనాలనే  వాళ్ల ఆలోచన మారుతోంది. కొత్తదా, పాతదా అని కాదు. సొంతంగా ఓ ఇల్లు ఉంటే బెటరని చాలామంది భావిస్తున్నరు. అది కూడా తమ బడ్జెట్ కు అనుకూలంగా ఉంటే చాలు రీ సేల్ ఇండ్లైనా సరే కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. దీంతో గ్రేటర్ లో రీ సేల్ ఇండ్లకు మస్తు డిమాండ్ పెరిగింది. కొత్త ఇంటి కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయటం, వెయిట్ చేయటం కన్నా ఉన్న ఫలంగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పైగా కోర్ సిటీ సహా, శివార్లలో ఎక్కడ కూడా ఇప్పుడు కొత్త ఇల్లును కొనలేని విధంగా రేట్లు పెరిగాయి. మిడిల్ క్లాస్ కు ఈ బడ్జెట్ లో సొంత ఇల్లు జీవిత కాలం కలగానే మిగిలిపోతోంది. అందుకనే ఇంటి కొనుగోలు విషయంలో సిటిజన్లలో మార్పు వస్తోంది.

సిటీలో ఉంటేనే బెటర్

సిటీలో సగానికి పైగా జనం ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చిన వారే. వీరిలో చాలా మంది ఇక్కడే స్థిరపడాలని భావిస్తుంటారు. ఉద్యోగావకాశాలకు తోడు పిల్లల చదువుల కోసం చాలా మంది సిటీనే ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి ఇక్కడ సొంతిల్లు కొనటమే ఫస్ట్ టార్గెట్. ఆఫీస్ కు, పిల్లల స్కూల్, కాలేజ్ కు దగ్గర ఉండేలా ఇల్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుకూలమైన చోట కావాలంటే రీ సేల్ ఇండ్లను కొనాల్సిందే. ఉదాహరణకు కోర్ సిటీలో కొత్త ఫ్లాట్ కావాలంటే కనీసం సుమారు రూ.  60–80 లక్షలు  పెట్టాల్సిందే. అదే రీసేల్ ఫ్లాట్లు ఇందులో సగం రేటుకే వస్తు వస్తుంటాయి. భారీ మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయలేని వారంతా ఇలాంటి ఇళ్లను కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా టైమ్ లో ఇంటి ఓనర్లతో ఇబ్బందిపడిన చాలా మంది జనం ఇక  చిన్న ఫ్లాట్ అయినా సరే చాలనుకుంటున్నారు.

జీఎస్టీ తగ్గుతుందని..

రీ సేల్ ఇండ్లు కొనటానికి జీఎస్టీ కూడా ఓ కారణమవుతోంది. కొత్త ఇల్లు కొంటే ప్రస్తుతం ఇంటి విలువ లో 18 శాతం జీఎస్టీ చార్జ్ చేస్తున్నారు. అంటే కోటి రూపాయల ఇంటికి  రూ. 18 లక్షలు జీఎస్టీకే చెల్లించాలి. చాలా వరకు మిడిల్ క్లాస్ జనం 40 నుంచి 50 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని కొనాలనుకున్నా జీఎస్టీ రూపంలో 9 నుంచి 10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద భారం. ఇంతకన్నా రీ సేల్ ఇల్లు కొంటే  రూ.10 లక్షల వరకు సేవ్ చేయవచ్చని జనం భావిస్తున్నారు. దీనికి తోడు ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. దీంతో   రీ సేల్ ఇండ్లనే ఎక్కువ మంది అడుగుతున్నారని ఓ రియల్ ఎస్టేట్ బిల్డర్ చెప్పారు.

శివార్లలో ఇన్వెస్ట్ మెంట్స్

సిటీ విస్తరించటంతో పాటు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీస్ పెరగటంతో శివార్లలో రీ సేల్ ఇండ్లకు గిరాకీ పెరిగింది. కోర్ సిటీతో పోల్చితే ఇక్కడ మరో రూ.10 నుంచి 20 లక్షల వరకు ధర తక్కువ ఉంటోంది. సిటీ శివారులో ఉన్న ప్రాంతాల్లో కూడా మార్కెట్ వాల్యూ స్పీడ్ గా పెరుగుతోంది. పదేళ్ల క్రితం శివార్లలో తక్కువ ధరకు కొన్న చాలా ఫ్లాట్లకు ఇప్పుడు మంచి ధర ఉంది. బాచుపల్లి, ప్రగతి నగర్, పటాన్ చెరు, సుచిత్ర, దుండిగల్, కీసర, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, పుప్పాల గూడ వరకు రియల్ వ్యాపారం విస్తరించింది. శివారులో అయినా సరే కచ్చితంగా డిమాండ్ పెరుగుతుందన్న నమ్మకం జనంలో పెరిగింది. దీంతో తమ దగ్గర ఉన్న డబ్బులను రీ సేల్ ఫ్లాట్లపై ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే అక్కడి భూముల ధరలను బట్టి ఫ్లాట్లు దొరుకుతున్నాయి.

 రిజిస్ట్రేషన్ కష్టాలు

రీ సేల్ ఫ్లాట్లకు మంచి గిరాకీ ఉన్న రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటం మార్కెట్ పై ఎఫెక్ట్ చూపింది. చాలా మంది రీ సేల్ ఇండ్లను కొనేందుకు ఆసక్తి చూపినా రిజిస్ట్రేషన్లు దాదాపు 4 నెలల పాటు నిలిపోవటంతో జనం ఇబ్బంది పడ్డారు. ముందు అనుకున్న దానికి ఇప్పటికీ రేట్ల విషయంలో తేడాలు రావటంతో చాలా మంది కొనడం  ఆపేశారు. మళ్లీ రిజిస్ట్రేషన్లు స్టార్ట్ కావటంతో ఇప్పుడంతా రీ సేల్ ఇళ్లకు సంబంధించి పీటీఐఎన్ (ప్రాపర్టీ ట్యాక్ ఇండెక్స్ నంబర్ ) కోసం వెతుకున్నారు. ఈ విషయం మ్యాజిక్ బ్రిక్స్ లాంటి సంస్థ నివేదికలో వెల్లడైంది. ఐతే చాలా ఇళ్లకు పీటీఐఎన్ నంబర్లు రాకపోవటం, అప్లయ్ విధానం గందరగోళంగా ఉండటంతో ఇప్పటికీ జనం ఇబ్బంది పడుతున్నారు.

రీ సేల్ ప్రాపర్టీ ఎన్  రోల్​ 20–30 శాతం పెరిగింది

కరోనా తర్వాత నిర్మాణ రంగంలో పనులన్నీ ఆగిపోయానని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్ లోకి వచ్చే కొత్త ప్రాజెక్టులు ఆగిపోవడం, కస్టమర్లకు డెలివరీ చేసేవి వాయిదా పడ్డాయన్నారు. కొత్త ప్రాజెక్టులను సేల్ చేయడానికి ఇబ్బందిగా మారిందని వారు అంటున్నారు. కానీ రీ సేల్ ప్రాపర్టీ విషయంలో ఇదీ భిన్నంగా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు. ఏటా రిజిస్టర్ అయ్యే ప్రాపర్టీ ఎన్ రోల్ కంటే ఈసారి   20–30 శాతం   పెరిగిందని వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. ఇందులో ఎప్పటి నుంచో ఇంటిని సేల్ చేయాలనుకున్న వారే ఎక్కువగా ఉన్నారన్నారు. కరోనా తర్వాత  ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో   ఈఎంఐలు భారం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అమ్ముకుని సొంతూళ్లకు వెళ్లినవారు కూడా ఉన్నారని రియల్ ఎస్టేట్ ఏజెంట్ మల్లేష్ యాదవ్ తెలిపారు. మ్యాజిక్ బ్రిక్స్, మకాన్ లాంటి రియల్ ఎస్టేట్ బ్రోకరేజీలలో రీ సేల్ ప్రాపర్టీల నమోదు దాదాపు 20శాతం వృద్ధి చెందాయి. ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఒక్క కూకట్ పల్లి ఏరియాలోనే 310 ఎన్ రోల్ మెంట్ రిజిస్టర్ కాగా  , ఇందులో 292 ప్రాపర్టీల అగ్రిమెంట్లు పూర్తి అయినట్లుగా ఆయా సంస్థల రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు మొత్తంగా ప్రాపర్టీ ఎన్ రోల్ మెంట్ 250 దాటలేదన్నారు. ఉప్పల్, ఎల్బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్ ఏరియాల్లోనూ గతేడాదితో పోల్చితే ఈసారి అమ్మకాలు పెరిగినట్లు ఈస్ట్ సిటీ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ఎగ్జిక్యూటివ్ మాధవ రావు వివరించారు.

రీ సేల్ ప్రాపర్టీ అమ్మకాలతో రిలీఫ్

ఆరేళ్లుగా సిటీలోని చాలా చోట్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అమ్మడం,కొనడం చేస్తున్నా. కరోనా తర్వాత మార్కెట్ పడిపోయిందని అనుకున్నాం. కానీ రీ సేల్ ప్రాపర్టీల అమ్మకాలు రిలీఫ్ నిచ్చాయి. లాక్​డౌన్​ టైమ్​లో 40 లక్షల లోపు ఉండే ఫ్లాట్ల కొనుగోళ్లు భారీగా జరిగాయి. సికింద్రాబాద్, ముషీరాబాద్, రామంతాపూర్, అంబర్ పేట, గోల్నాక,విద్యానగర్, తార్నాక,ఈసీఐఎల్  ఏరియాల్లో ఎక్కువగా 50 నుంచి 60 లక్షల లోపు  ప్రాజెక్టులు ఉంటాయి. ఇతర ఫైనాన్సియల్ సపోర్టు లేక, అవసరాల కోసం, వ్యాపారాలు నడవక కొందరు ఫ్లాట్లను అమ్ముకున్నారు.దీంతో ప్రతి నెల 8 ఫ్లాట్ల రీ సేల్ జరిగింది. 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే సేల్స్ మరింత పెరిగేవి. చాలా వరకు అగ్రిమెంట్లు చేసుకుని రిజిస్ట్రేషన్ కాకపోవడంతో వాయిదా పడ్డవి, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నవి కూడా ఉన్నాయి.

– వెంకటేశ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్