
హైదరాబాద్, వెలుగు: ఎంసెట్ సీట్ల మొదటి విడత కేటాయింపులో సుమారు 16 వేల సీట్లు మిగిపోయాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలో కంప్యూటర్ సైన్స్(సీఎస్‍ఈ) కోర్సులో 961 సీట్లు మాత్రమే మిగిలాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో కేవలం 80 సీట్లు మాత్రమే మిగలడం కంప్యూటర్ ఇంజినీరింగ్‍కు విద్యార్థులకు ఉన్న ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదనడానికి నిదర్శనం. సగటునా ఒక్కో విద్యార్థి 21 ఇంజనీరింగ్ కాలేజీలలో సీఎస్‍ఈ కోర్సులకు పోటీ పడ్డట్లు అధికారిక గణంకాలను బట్టి తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 52628 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వగా అందులో 45,514 మంది(86.48) శాతం సీఎస్‍ఈ ఆప్షన్లు ఇచ్చారు. తర్వాత స్థానంలో ఈసీఈ(35937), ఐటీ(21646), ఈఈఈ(20410), సివిల్(16608), మెకానికల్(14612) మంది ఆప్షన్లు ఇచ్చారు. బీఫార్మసీ, ఫార్మా డి లోనూ 3698 భర్తీ కాలేదు.
గ్రేటర్‍లో 70శాతం సీట్లు భర్తీ
గ్రేటర్‍లో పరిధిలోని ఎల్‍బీ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‍కేసర్, కీసర, భువనగిరి, హయత్‍నగర్, అబ్దుల్లాపూర్‍మెట్, గండిపేట్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో సుమారు 150 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో అన్ని ఇంజినీరింగ్ విభాగాలు కలిపి దాదాపు 50 వేల సీట్ల వరకు ఉంటాయి. ఎంసెట్ సీట్ అలాట్‍మెంట్‍లో దాదాపు అన్ని కాలేజీల్లో కలిపి 70–75 శాతం వరకు సీట్లు భర్తీ అయినట్లు సమాచారం. గ్రేటర్‍లోని ఇంజినీరింగ్ కాలేజీలలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల సీట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. నానాటికీ ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత తగ్గుతూ రావడం మరోపక్క ఇంజనీరంగ్ చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు అంతగా లేకపోవడం మూలంగా ఏటా అందులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఇదే సమయంలో ఇండియన్ ఇన్‍స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లలో చేరేందుకు ఏటా డిమాండ్ పెరుగుతుండటం గమనార్హం. ఎంసెట్‍లో టాప్ ర్యాంకులు వచ్చిన వారు జేఈఈలో కూడా మంచి ర్యాంకులు రావడంతో సీటు దొరికిన వారందరూ దాదాపుగా ఐఐటీలో చేరారు. టాప్ ఇంజినీరింగ్ కాలేజీలలో గతంలో కంటే ఈసారి ఫీజులు 15 నుంచి 20 శాతం వరకు పెరగడంతో ప్రభుత్వ రీయంబర్స్ మెంట్ మేరకు ఫీజులను వసూలు చేసే కాలేజీలలోనే విద్యార్థులు అధికంగా చేరేందుకు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. టాప్ కాలేజీలలో కన్వీనర్ సీట్లలలో చేరిన విద్యార్థులు మిగిలిన ఫీజును సొంతగా చెల్లించాల్సి ఉంటుంది.