
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్యాసింజర్ల రద్దీతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. రాఖీ పండగ సందర్భంగా ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో హైదరాబాద్ లోని జేబీఎస్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్లలో ఫుల్ రష్ కనిపిస్తోంది. మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రో రైల్, ట్రెయిన్లు కూడా ఫుల్ రష్‌తో నడుస్తున్నాయి. శుక్రవారం వరలక్ష్మీవ్రతం, శనివారం రాఖీ పౌర్ణమి, ఆ తర్వాత ఆదివారం.. వరుసగా సెలవులు రావడంతో నగర వాసుల ప్రయాణాలు పెరిగాయి. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్, ఎంజీబీఎస్‌లలో రద్దీ బాగా పెరిగింది.
దీంతో ఎల్బీ నగర్, ఆరామ్‌ఘర్, ఉప్పల్, మేడ్చల్, కేపీహెచ్ బీ, మియాపూర్ ప్రాంతాల నుంచి కూడా బస్సులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. వరుసగా నాలుగు రోజుల నుంచి అన్ని బస్సులు, రైళ్లలో ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు పండగలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 3,500 సర్వీసులతో పాటుహైదరాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 400 స్పెషల్ బస్సులను ఏర్పాటుచేశారు.
సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా, పండగల నేపథ్యంలో దాదాపు10 లక్షల మంది అదనంగా ప్రయాణించారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయినా ప్రయాణికుల రద్దీ మాత్రం భారీగా ఉందని అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక టీంలు ఏర్పాటు అయ్యాయని, వీరు ఎప్పటికప్పుడు బస్సుల రాకపోకలను పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నారని పేర్కొన్నారు.
రైళ్లలోనూ పెరిగిన రద్దీ
గత నాలుగు రోజుల నుంచి మెట్రో ట్రైన్లలోనూ ప్రయాణికుల రద్దీ పెరిగింది. మెట్రో రైళ్లలో రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ఇటీవల మెట్రో చార్జీలను పెంచడంతో ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.70 లక్షలకు తగ్గింది. కానీ గత రెండు రోజుల నుంచి వివిధ కారిడార్లలో రికార్డు స్థాయిలో ప్రయాణాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఎక్కువ మంది మెట్రో రైల్‌ను ఆశ్రయించారు.
రాయదుర్గం నుంచి అమీర్‌పేట, నాగోల్ రూట్, ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ కారిడార్‌లో అత్యధిక మంది ప్రయాణం చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒక మెట్రో నడిచినప్పటికీ వేలాది మంది మెట్రోస్టేషన్లలో పడిగాపులు కాసినట్టు చెబుతున్నారు. ఇక రాఖీ పండగ సందర్భంగా శనివారం దాదాపు 5.40 లక్షల మంది ప్రయాణం చేశారు.
మెట్రోరైల్ మాత్రమే కాకుండా ఇతర రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా లోకల్, ఎంఎంటీఎస్ రైళ్లలోనూ భారీ సంఖ్యలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి తదితర రైల్వేస్టేషన్ల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు ప్రయాణం చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
రేపటి వరకూ స్పెషల్ బస్సులు..
వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి పర్వదినాలను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. రాఖీ పండుగ స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే చార్జీలను 50 శాతం పెంచినట్టు అధికారులు తెలిపారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని, ఈ నెల 11 వరకు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే సవరణ చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు.
స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవచ్చని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని, ఈ జీవో ప్రకారం ఈ బస్సుల్లో చార్జీలను సవరించినట్టు చెప్పారు. అయితే, సాధారణ సర్వీసుల్లోనూ 50 శాతం వరకూ అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారని, అసలు పండగల సమయంలో స్పెషల్ బస్సుల పేరిట చార్జీల వడ్డింపు ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.