
- విజిటర్స్ కి అనుమతి లేదు
- కాళేశ్వరం పరిసరాల్లో హై అలర్ట్
- ప్రముఖుల భద్రతకు పోలీసులు కసరత్తు
- మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కూంబింగ్
- మెటల్ డిటెక్టర్లు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు
- ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్ల రాకతో హై అలర్ట్
- మావో ప్రభావిత ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసుల కూంబింగ్
- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గడ్చీరోలి సరిహద్దుల్లో నిఘా
- ప్రాజెక్టు పరిసర 3 వలయాల్లో బందోబస్తు
- ప్రతీ 100 నుంచి 200 మీటర్లకొక పోలీసు
- మొత్తం 4వేల 700 మంది పోలీసులతో బందోబస్తు
జూన్ 21 శుక్రవారం రోజున కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుకలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల సీఎంలతో పాటూ ఇద్దరు గవర్నర్లు ప్రజాప్రతినిధులు హాజరుకానుండడంతో కాళేశ్వరం పరిసర ప్రాంతాలన్నీ హైఅలర్ట్ జోన్ లో వెళ్లిపోయాయి.
కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లోని 50 కిలోమీటర్ల మేర పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డు మార్గంలో వచ్చే వాహనాల్ని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. వాహన తనిఖీలతో డ్రోన్ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం 72 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఏపీ,తెలంగాణ గవర్నర్ నరసింహన్ తో పాటు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హాజరుకానున్నారు. దీంతో వీరి భద్రత బందోబస్తు పోలీసులకి కత్తిమీద సాములా మారింది.
మొత్తం 4వేల 7వందల మంది పోలీసుల్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏరియాతో పాటు పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ప్రధానంగా వీఐపీ మూవ్మెంట్ ఉండే కన్నెపల్లి, మేడిగడ్డ, కాళేశ్వరం, మల్హర్ ,భూపాలపల్లి, మంథని ఏరియాలతో పాటు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో నిఘా పెట్టారు పోలీసులు. ఏపీ, తెలంగాణ పోలీసులతో పాటు మహారాష్ట్ర స్పెషల్ పార్టీ పోలీసులు,స్టేట్ ఆక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు భధ్రతా ఏర్పాట్లలో భాగంగా ఏజెన్సీ ఏరియాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వీఐపీ, వీవీఐపీలు హాజరయ్యే కాళేశ్వరం ప్రాజెక్ట్ బందోబస్తు ఏర్పాట్లని డీజీపీ, అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలతో పాటు ఇద్దరు కమిషనర్లు, నలుగురు ఏఎస్పీలు, 20 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏ విధంగా ఉండాలి, కార్యక్రమాల నిర్వహణ ఎలా సాగాలి, ప్రత్యేక పూజలు, హోమం, పైలాన్ ఆవిష్కరణ, గేట్లను ఎలా ప్రారంభించాలన్న దానిపై ఇప్పటికే ఉన్నతాధికారులు ప్లానింగ్ రెడీ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే సీఎం లు ,గవర్నర్లు 5 నుండి 6 హెలికాప్టర్లలో రానున్నారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఎమర్జెన్సీ హెలిప్యాడ్ తో కలిపి మొత్తం 7 ల్యాండింగ్ స్ధలాల్ని ఏర్పాటు చేశారు. వీరితో పాటు మహారాష్ట్ర,ఏపీ, తెలంగాణ డీజీపీలు,చీఫ్ సెక్రటీరీలతో పాటు ఉన్నతాధికారులు, ఈ ప్రాజెక్ట్ కి రుణాలిచ్చిన వివిధ బ్యాంకులకి చెందిన 13 మంది మేనేజింగ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో పాటు కొందరు మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కావాలో వాళ్లకి ఇన్విటేషన్లతో పాటు పాసులు ఇచ్చామంటున్నారు అధికారులు. అయితే అనుమతి లేని నేతలెవరైనా ఈ కార్యక్రమంలో హాజరుకావాలని యత్నిస్తే ఆ వెహికిల్స్ రోడ్డు మార్గమధ్యలోనే నిలిపివేస్తామంటున్నారు పోలీసు అథికారులు.
మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ పంప్ హౌజ్, ప్రాణహిత పరిసరాల్లోని గ్రామాలు, ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసులు పహారా ఉంచారు. ప్రాజెక్టు పరిసరాలను 3 వలయాలుగా విభజించి గ్రేహౌండ్స్‌బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని అటవీ గ్రామాలను పోలీసులు ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ఆలయంతో పాటు కన్నెపల్లి పంపుహౌజ్, మేడిగడ్డ బ్యారేజీల వద్ద వెయ్యి మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇప్పటికే కూంబింగ్ బ్రుందాలు గోదావరి పరివాహక ప్రాంతాల్ని జల్లెడ పడుతన్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన తర్వాత తిరిగి వెళ్లే వరకు కట్టు దిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఆఫీసర్లకి డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.