హైదరాబాద్: అల్మాస్ గూడలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి కాలికి చైనా మాంజా తగిలింది. ఈ ఘటనలో.. వృద్ధురాలి కాలు తెగిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. చైనా మాంజా ప్రజలు, వాహనదారుల పాలిట యమపాశంలా మారుతోంది. ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజా(సింథటిక్ దారం)ను వాడుతున్నారు. అయితే, రాష్ట్రంలో చైనా మాంజాపై నిషేధం ఉన్నా... దొంగచాటున అమ్ముతున్నారు.
చైనా మాంజా కేవలం దారం కాదు.. గాజు పొడి, ప్లాస్టిక్, ఇతర రసాయనాలతో తయారైన చాలా ప్రమాదకరమైన దారం. అసలు తెగదు.. మనిషి చర్మాన్ని కోసుకుంటూ వెళ్తోంది. గతంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బ్రిడ్జిలపై, రోడ్లపై వెళ్తున్న బైకర్ల మెడకు చైనా మాంజా చుట్టుకుని గొంతులు తెగిపోయిన ఘటనలు ఉన్నాయి. పండుగకు ముందే పలువురు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో ఆసుపత్రుల పాలుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎగిరే పక్షులు ఈ దారంలో చిక్కుకుని చనిపోతున్నాయి.
►ALSO READ \ హైదరాబాద్ పోచారంలో బ్యాంకులో మంటలు.. కాలి బూడిదైన ఫైళ్లు
ఓల్డ్‌సిటీలోని కాలాపత్తర్‌లో రూ.7 లక్షల చైనా మాంజా పట్టుబడింది. మహ్మద్ షాజైబ్ అలియాస్ అనీస్ (42) కాలాపత్తర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా పతంగుల వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారంతో ఆదివారం అనీస్ దుకాణంపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అండ్ సౌత్ వెస్ట్ జోన్ టీమ్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఇక్బాల్ సిద్దిక్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాదేందర్, ఎస్‌ఐపీ జి. సందీప్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు దాడి చేశారు.
345 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు.హర్యానాకు చెందిన తన సహచరుడు విక్రమ్ మెహతా ద్వారా మాంజాను హైదరాబాద్‌కు తెప్పించి అమ్ముతున్నట్లు గుర్తించారు. పట్టుబడిన మాంజా విలువ దాదాపు రూ.7 లక్షలు వరకు ఉంటుందని పోలీసుల అంచనా.
