
- కృష్ణా బేసిన్‌లో నాలుగు మేజర్ డ్యాంల గేట్లు ఎత్తివేత
- గోదావరి బేసిన్‌లో అలుగు పోస్తున్న 60 % చెరువులు
- తుంగభద్ర గేట్లు ఓపెన్
- జూరాల నుంచి కిందికి 1.21 లక్షల క్యూసెక్కులు
- ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి ఉగ్రరూపం
- పూర్తిగా నిండిన 15 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు
హైదరాబాద్, వెలుగు: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నయ్. భారీ ప్రవాహాలతో చెరువులు మత్తళ్లు దుంకుతున్నయ్. అటు కృష్ణా , ఇటు గోదావరి బేసిన్ల ప్రాజెక్టుల్లోకి పెద్ద స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఇప్పటికే కృష్ణా బేసిన్‌లో నాలుగు మేజర్ డ్యాంల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక గోదావరి బేసిన్‌లో 60 శాతంపైగా చెరువులు అలుగుపోస్తున్నాయి.
కృష్ణమ్మకు భారీ వరద
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం, కోయ్నా, వర్నాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కర్నాట కలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లోకి పెద్ద స్థాయిలో ప్రవాహం వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండటంతో ఆదివారం సాయంత్రం పవర్ హౌస్ ద్వారా నీటిని దిగువకు వదిలారు. సోమవారం ఉదయం డ్యాం గేట్లు ఎత్తనున్నట్టుదిగువ ప్రాంతాలకు హెచ్చరిక జారీ చేశారు. ఇక ఎగువ గో దావరిలో మోస్తరుకు మించి ప్రవాహాలు ఉండగా.. ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. మేడిగడ్డనుంచి పది లక్షల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నారాయణపూర్ నుంచి 2.37 లక్షల క్యూసెక్కులు
ఆదివారం సాయంత్రం ఆల్మట్టి నుంచి 1.80 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 2.37 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 119.30 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు గాను 33.25 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూరాలకు 1.03 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, కిందికి 1.21 లక్షల క్యూ సెక్కులు వదులుతున్నారు. ఈ డ్యాంలో 9.66 టీఎంసీలకు గాను 8.18 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర కు 33 వేల క్యూ సెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 8 వేల క్యూసెక్కుల నీటిని పవర్ హౌస్ ద్వారా నదిలోకి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టులో 100.86 టీఎం సీలకు 98.55 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో కి 1.31 లక్షల క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా లెఫ్ట్ పవర్‌హౌస్ నుంచి 42 వేల క్యూ సెక్కులు సాగర్‌లోకి వదులుతున్నారు. శ్రీశైలం సామర్యం 215.81 టీఎంసీలు కాగా, 144.80 టీఎంసీల నీళ్లునిల్వ ఉన్నాయి. సాగర్‌లో 312.05 టీఎంసీలకు గాను 249.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
కృష్ణా బేసిన్ చెరువుల్లో అంతంతమాత్రమే..
కృష్ణా బేసిన్‌లో 12 శాతం చెరువులే అలుగు పారుతున్నాయి. మొత్తం 23,301 చెరువులు ఉండగా, 2,889 మాత్రమే పూర్తిగా నిండాయి. ఇంకో 2,448 చెరువులు నిండటానికి సిద్ధంగా ఉన్నాయి. 30 శాతానికి పైగా చెరువుల్లో నాలుగో వంతు నీళ్లు కూడా చేరలేదు. 3,522 చెరువులు సగానికి పైగా నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6,419 చెరువులకు గాను 299 పూర్తిగా నిండాయి. నల్గొండ జిల్లో4,454 చెరువులకు గాను 631, మెదక్ జిల్లాలో 8,782 చెరువులకు గాను 1,888, రంగారెడ్డిజిల్లాలో 3,646 చెరువులకు గాను 71 పూర్తిగా నిండాయ
15మీడియం ప్రాజెక్టులు నిండినయ్
రాష్ట్రంలో 15 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి నీళ్లుకిందికి ప్రవహిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్‌టీఆర్ సాగర్, పీపీరావు ప్రాజెక్టు, మంచిర్యాల జిల్లాలో నీల్వాయి ప్రాజెక్టు, ర్యాలీవాగు, భూపాలపల్లి జిల్లాలో గుండ్లవాగు, ములుగు జిల్లాలో లక్నవరం, పాలెంవాగు, కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు, తాలిపేరు, కిన్నెరసాని, వికారాబాద్ జిల్లాలో కోటిపల్లి వాగు, వరంగల్ రూరల్ జిల్లాలో పాకాల, ఖమ్మం జిల్లాలో వైరా, లంకా సాగర్, మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం చెరువు పూర్తిగా నిండాయి.