
ఆస్ట్రేలియాలో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇండియా 1–3తో ఓడిన తర్వాత బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 45 కంటే ఎక్కువ రోజులు జరిగే టూర్‌లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు 14 రోజులు మాత్రమే వారితో ఉండవచ్చు. షార్ట్ టూర్లలో ప్లేయర్ల భార్యాపిల్లాలు లేదా గర్ల్‌ఫ్రెండ్స్ ఒక్క వారం మాత్రమే ఉండేలా పరిమితి విధించింది. ఈ రూల్ పై కోహ్లీతో సహా దిగ్గజ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా బీసీసీఐ తీసుకొచ్చిన ఫ్యామిలీ రూల్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని రైనా ఉదాహరణగా తీసుకొని తన యూట్యూబ్ ఛానెల్‌లో రణవీర్ అల్లాబాడియాతో మాట్లాడాడు. " విదేశీ పర్యటనలో కుటుంబం ఉండటం చాలా ముఖ్యం. నేను బీసీసీఐ రూల్ ను వ్యతిరేకిస్తున్నాను. కుటుంబని ఖచ్చితంగా అనుమతించాలి. ఫామ్ లో లేని ఆటగాళ్లు తమ ఫామ్‌ను తిరిగి పొందడానికి కుటుంబం సహాయపడుతుంది. కోహ్లీ వాళ్ళ కూతురు స్టాండ్స్ లో నించొని చప్పట్లు కొడుతుంటే ఒకసారి ఊహించుకోండి. కోహ్లీకి ఇది గర్వించే క్షణం. విరాట్ (కోహ్లి) అత్యుత్తమ ఫామ్‌లో లేకుంటే.. అతని కుమార్తెను చూస్తే పరుగుల వరద పారిస్తాడు". అని రైనా చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో చాలా బాగా ఆడిన తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా రైనా పంచుకున్నాడు. "కుటుంబంతో కలిసి ఉండాలి. నా భార్య లేకపోతే, నేను 2018లో (దక్షిణాఫ్రికాపై) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచి ఉండే వాడిని కాదు". అని రైనా అన్నాడు. ఈ విషయంపై ఆర్‌సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ సమ్మిట్‌లో కోహ్లీ నాలుగు నెలల క్రితం తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ‘కుటుంబం ఎంత ముఖ్యమో చెప్పడం కష్టం.
మైదానంలో ఎంతటి ఒత్తిడి ఎదురైనా తిరిగొచ్చి కుటుంబంతో గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆటలో నిరాశకు గురైనప్పుడు మనకు ఇష్టమైన వారు పక్కనే ఉంటే ఆ బాధ నుంచి కోలుకోవచ్చు. నా వరకు గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడటం ఇష్టం లేదు. అందరిలానే సాధారణ జీవితాన్ని కొనసాగించాలనుకుంటాను. ఆడటం నా బాధ్యత, కానీ కుటుంబంతో గడిపే సమయం నా నిజమైన ఆనందం.
అందుకే నేనెప్పుడూ కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోకుండా చూసుకుంటా. నేనే కాదు ఏ ఆటగాడైనా కుటుంబం తమతోనే ఉండాలని అంటాడు. కానీ ఈ విషయం గురించి కొందరు సంబంధం లేని వ్యక్తులు చర్చలు జరపడం చూసి బాధ కలుగుతోంది’ అని విరాట్ పేర్కొన్నాడు. ఇక, తన ఫిట్‌నెస్, తీసుకునే డైట్ విషయంలో తల్లిని ఒప్పించడం ఎంతో కష్టమైందని కోహ్లీ చెప్పాడు.
Do you agree with Suresh Raina? 🤔 pic.twitter.com/pJkeohne5M
— CricketGully (@thecricketgully) July 12, 2025