ఉప్పొంగుతున్నగోదారి

ఉప్పొంగుతున్నగోదారి
  • మేడిగడ్డ వద్ద 1.80 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • నిండుకుండలా కడెం ప్రాజెక్టు
  • అలుగు పోస్తున్న 350 చెరువులు
  • జూరాలకు లక్ష క్యూసెక్కుల కృష్ణమ్మ వరద
  • అర్ధరాత్రి దాటాక గేట్లు ఎత్తే అవకాశం

హైదరాబాద్‌‌, వెలుగుగోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో భారీ వరద రావడంతో ఇటు మేడిగడ్డ, అటు రామన్నగూడెం, భద్రాచలం వద్ద వరద పోటెత్తుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరి ప్రధాన నదిలోనూ భారీ ప్రవాహం ఉంది. ఈ వర్షాలకు అక్కడి గైక్వాడ్‌‌ ప్రాజెక్టు, ఇతర బ్యారేజీలు నిండితే ఎస్సారెస్పీకి ఇన్‌‌ఫ్లో వస్తుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. జూరాలకు కృష్ణమ్మ పోటెత్తింది. మంగళవారం ఉదయం 1.26 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, రాత్రి ఏడు గంటల సమయానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. కడెం ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 7.60 టీఎంసీలకు, 6.05 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ప్రాజెక్టులోకి 12,554 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు 6, 9, 10 గేట్లను ఎత్తి 26,400 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. గురువారం ఈ నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతాయి.

మేడిగడ్డ వద్ద పరవళ్లు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం ఇక్కడ 85 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా మంగళవారం మరో లక్ష క్యూసెక్కుల వరద పెరిగింది. సాయంత్రానికి 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా, మేడిగడ్డ బ్యారేజీ 4, 5, 6 బ్లాకుల్లోని 30 గేట్లను ఎత్తి 4.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీలో ప్రస్తుతం 7 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. కన్నెపల్లి పంపుహౌస్‌‌ నుంచి సోమవారం వరకు నీటిని ఎత్తిపోసిన అధికారులు మంగళవారం వాటిని ఆఫ్‌‌ చేశారు. అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.87 టీఎంసీలకు ప్రస్తుతం 8.34 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. సుందిళ్ల పంపుహౌస్‌‌లో మంగళవారం మధ్యాహ్నం ఒక మోటారును ట్రయల్‌‌ రన్‌‌ చేయాలని అనుకున్న ఇంజనీర్లు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సుందిళ్ల సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా.. మంగళవారం సాయంత్రానికి 5.99 టీఎంసీల నీళ్లు చేరాయి. ఇక్కడి నుంచి గోదావరి నదిలో 30.50 కి.మీ.ల మేర నీళ్లు నిలిచి ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 6లోని నందిమేడారం పంపుహౌస్‌‌లో ఆరో నంబర్‌‌ మోటారును ఇంజనీర్లు వెట్‌‌ రన్‌‌ చేశారు. 225 మెగావాట్ల పంపు ఒక్క రోజులో 3,200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది.

రామన్నగూడెం వద్ద ప్రమాదకర స్థాయిలో..

మేడిగడ్డ నుంచి వరద పోటెత్తుండగా.. ఇంద్రావతి నీళ్లు కలిసి ఏటూరునాగారం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కరఘాట్‌‌ వద్ద సోమవారం సాయంత్రం 6 గంటలకు 4.67 మీటర్ల ప్రవాహం ఉండగా మంగళవారం సాయంత్రానికి 8.08 మీటర్లకు పెరిగింది. ఇక్కడ గోదావరి నీటి మట్టం 9.70 మీటర్లకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగే అవకాశముండటంతో బుధవారం తెల్లవారుజాము కల్లా హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం వద్ద గల గోదావరి ఇంటేక్‌‌వెల్‌‌లోకి భారీగా వరద నీరు చేరింది. మణుగూరు వద్ద పది రోజుల క్రితం వరకు ఎడారిని తలపించిన గోదావరి నది ఇప్పుడు రెండు ఒడ్లను తాకుతూ ఉరకలెత్తుతోంది. కొండాయిగూడెం శివారులోని బైద్యనాదలింగేశ్వర స్వామి ఆలయ పుష్కరఘాట్‌‌ను ఆనుకొని గోదావరి ప్రవహిస్తోంది. చిన్నరావిగూడెం నుంచి పర్ణశాల వరకు గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. భూపాలపల్లి జిల్లా వాజేడు మండల పేరూరు వద్ద గోదావరిలో 12 మీటర్ల మేర ప్రవాహం ఉంది. ఇది ఇంకాస్త పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద 30 అడుగుల మేర ప్రవాహం ఉంది, బుధవారం ఉదయం వరకు ఇది 40 అడుగులకు చేరే అవకాశం కనిపిస్తోంది.

మత్తడి దుంకుతున్న చెరువులు

గోదావరి బేసిన్‌‌లో కురుస్తున్న భారీ వర్షాలతో 350 చెరువులు మత్తడి దంకుతున్నాయి. అలుగు పోస్తున్నాయి. ఆదిలాబాద్‌‌ ఇరిగేషన్‌‌ సర్కిల్‌‌లో 2,702 చెరువులు ఉండగా వాటిలో 40 చెరువులు పూర్తిగా నిండాయి. 150 చెరువుల్లో 75 శాతానికిపైగా, 576 చెరువుల్లో సగానికిపైగా నీళ్లు చేరాయి. 1,218 చెరువు దాదాపు సగం వరకు నిండాయి. కరీంనగర్‌‌ సర్కిల్‌‌లో 4,344 చెరువులు ఉండగా 16 చెరువులు పూర్తిగా నిండాయి. 94 చెరువులు 75 శాతానికిపైగా, 170 చెరువులు సగానికిపైగా నిండాయి. వరంగల్‌‌ సర్కిల్‌‌ పరిధిలో 6,127 చెరువులకు 231 చెరువులు అలుగు పోస్తున్నాయి. 457 చెరువులు 75 శాతానికి పైగా, 300 చెరువులు సగానికిపైగా నిండాయి. ఖమ్మం సర్కిల్‌‌ పరిధిలో 3,883 చెరువులకు 39 చెరువులు పూర్తిగా నిండాయి. ఇక్కడ 159 చెరువులు 75 శాతం, 276 చెరువులు సగానికిపైగా నిండాయి. నిజామాబాద్‌‌ సర్కిల్‌‌లో 3,170 చెరువులు ఉండగా 24 చెరువులు అలుగు పోస్తున్నాయి. ఇక్కడ 85 చెరువులు 75 శాతానికిపైగా, 237 చెరువులు సగానికిపైగా నిండాయి.

జూరాలకు జలకళ

కర్నాటకలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. నారాయణపూర్‌‌ జలాశయం నుంచి మంగళవారం తెల్లవారుజామున జూరాలకు నీళ్లు చేరాయి. రాత్రి 9 గంటల వరకు నారాయణపూర్‌‌ 20 గేట్లు ఎత్తి 2,11,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌‌లోకి 1.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాల ప్రాజెక్టులోకి రాత్రి 9 గంటల వరకు 5.97 టీఎంసీల నీళ్లు వచ్చాయి. 1,04,414 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా, పవర్‌‌హౌస్‌‌ మూడు యూనిట్ల ద్వారా విద్యుత్‌‌ ఉత్పత్తి చేస్తూ 21 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నెట్టెంపాడు ద్వారా 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌‌ ద్వారా 1,300 క్యూసెక్కులు, కోయిల్‌‌సాగర్‌‌ నుంచి 315 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. రెండు కాలువల ద్వారా 700 క్యూసెక్కుల నీళ్లు వదులుతున్నారు. గురువారం తెల్లవారుజాము కల్లా జూరాల గేట్లు ఎత్తి నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.

కరువు తీరా వానలు

వానల కరువు తీరుతోంది. లోటు వర్షపాతం తగ్గుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వారం క్రితం 37% ఉన్న వర్షపాతం లోటు 18 శాతానికి తగ్గింది. 36.75 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 29.99 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఎక్కువగా నల్గొండ జిల్లాలో వర్షపాతం లోటు 40 శాతంగా ఉంది. ఆ తర్వాత వికారాబాద్​లో 38%, సూర్యాపేట, ఖమ్మంలలో 37, సంగారెడ్డి, మహబూబాబాద్​లలో 36% చొప్పున లోటు వర్షపాతం రికార్డైంది. కుమ్రం భీం జిల్లాలో ఎక్కువగా సాధారణం కన్నా 8 శాతం ఎక్కువ వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం 51.43 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 55.5 సెంటీమీటర్ల వాన పడింది. కాగా, తూర్పు మధ్యప్రదేశ్​, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్​గఢ్​ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ గుజరాత్​, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర మహారాష్ట్ర నుంచి ఇంటీరియర్​ ఒడిశా వరకు తూర్పు మధ్యప్రదేశ్​, చత్తీస్​గఢ్​ మీదుగా 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 4వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో బుధవారం కొన్ని చోట్ల భారీ వర్షం