చేవెళ్ల బస్సు ప్రమాద సంఘటనలో మరణించిన 19 మందికి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 7న వికారాబాద్ జిల్లా యాలాల మండలము ప్యార్కంపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన ముగ్గురు అక్కచెల్లెళ్ల కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల బస్సు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. ప్రమాదం జరిగిన తర్వాత రోడ్లు మరమ్మత్తులు చేయడమేంటని ప్రశ్నించారు. ముందే ఈ రోడ్డు మరమ్మత్తు చేపట్టితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని, 19 మంది కుటుంబాలు రోడ్డున పడేవి కావన్నారు కవిత. బాధితులను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాను వారికి అండగా నిలుస్తానని చెప్పారు.
నవంబర్ 3న చేవేళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర టిప్పర్ లారీ బస్సును ఢీ కొట్టడంతో 19 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షలు,ఆర్టీసీ నుంచి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీఎంఎన్ఆర్ నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
