
- ఏదో ఒక సాకుతో లబ్ధిదారులను తగ్గిస్తున్న వాటర్ బోర్డు అధికారులు
- ప్రస్తుతం గ్రేటర్లో5 లక్షల కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తింపు
- దరఖాస్తు చేసినా కొందరికి ఫ్రీ వాటర్ ఇవ్వట్లే
గన్ ఫౌండ్రీకి చెందిన తిమ్మయ్య ఇంటికి ఫ్రీ వాటర్ స్కీమ్ ఉంది. నల్లా మీటర్ పాడైందని గతంలో వాటర్ బోర్డు అధికారులకు తిమ్మయ్య కంప్లయింట్ చేశాడు. మీటర్‌ను చెక్ చేసేందుకు అధికారులు, సిబ్బంది రాలేదు. జులై నెలకు సంబంధించి అతడికి నల్లా బిల్లు రూ.485ను పంపించారు. ఫ్రీ వాటర్ స్కీమ్ అమల్లో ఉన్నప్పటికీ మీటర్ సాకుతో అధికారులు బిల్లును పంపించారంటూ 4 రోజుల కిందట వాటర్ బోర్డుకు ట్విట్టర్ లో తిమ్మయ్య కంప్లయింట్ చేశాడు. అయినప్పటికీ అధికారులు స్పందించలేదని.. నేటికీ మీటర్ ను మార్చలేదని తిమ్మయ్య చెబుతున్నాడు. శేరిలింగంపల్లికి చెందిన అనిత ఇంటికి ఈ ఏడాది నుంచి జనవరి నుంచి ఫ్రీ వాటర్ స్కీమ్ అమలవుతోంది. అయినప్పటికీ ఆమెకు ఫిబ్రవరి నుంచి ప్రతి 2 నెలలకోసారి నల్లా బిల్లలను పంపిస్తున్నారు. బిల్లు ఎందుకిస్తు న్నారని అధికారులను అడిగితే పట్టించుకోవట్లేదని అనిత తెలిపింది.
హైదరాబాద్ : గ్రేటర్లో ఫ్రీ వాటర్ స్కీమ్ సరిగా అమలు కావడం లేదు. 2020 డిసెంబర్ లో ప్రతి నల్లా కనెక్షన్ కు 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ ను సప్లయ్ చేస్తామని వాటర్ బోర్డు ఈ స్కీమ్ ను ప్రకటించింది. కానీ ఏడాదిన్నర తర్వాత కూడా కొందరికి ఫ్రీ వాటర్ అందడం లేదు. మరికొందరికి ఈ ఏడాది జనవరి వరకే ఫ్రీ వాటర్‌కు అందగా.. బిల్లులు ఇప్పుడు వస్తున్నాయి. ఆ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్ పై నేటికీ కూడా చాలామందికి అపోహలు వీడటం లేదు. వాటర్ బోర్డు పరిధిలో డొమెస్టిక్ కేటగిరిలో దాదాపు 9 లక్షల 84వేల కనెక్షన్లు, కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరిలో దాదాపు 45 వేల వరకు కనెక్షన్‌లు ఉన్నాయి. డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో దాదాపు 5 లక్షల కుటుంబాలకు 20 వేల లీటర్ల ఉచిత నీరు అందిస్తున్నట్లు వాటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి ఈ స్కీమ్ అందడం లేదు. ఇందులో కొందరు దరఖాస్తు చేసుకోకపోగా, మరికొందరు చేసుకున్నా కూడా వర్తించడం లేదని చెబుతున్నారు. మొన్నటి వరకు ఉచిత నీరు అందిన వారికి అనేక కారణాలతో ఇప్పుడు బిల్లులు జారీ అవుతున్నాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి వరకు ఉచితంగా నీటి సప్లయ్ జరిగిన ఇండ్లకు ఏదో ఒక కారణం చెబుతూ అధికారులు మళ్లీ బిల్లులు వేస్తున్నారు. కొందరికి 2 నెలలకోసారి బిల్లులు ఇస్తున్నారు. ఫ్రీ వాటర్ స్కీమ్ ఎందుకు వర్తించడం లేదని అడిగితే చూస్తామని చెబుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదు.
ఒకే మీటర్ ఉంటే..
డొమెస్టిక్ స్లమ్, డొమెస్టిక్- ఇండివిడ్యువల్, మల్టీస్టోర్డ్ బిల్డింగ్(ఎంఎస్‌బీ), గేటెడ్ కమ్యూనిటీ కేటగిరీల కింద ప్రతి గృహ వినియోగదారుడు ఈ స్కీమ్ పొందవచ్చని ప్రారంభంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ స్కీమ్ కోసం నమోదు చేసుకున్న ప్రతి ఇల్లు, ఫ్లాట్, యూనిట్ వినియోగదారులు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని పొందేందుకు అర్హులని తెలిపారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎన్ని కిచెన్లు ఉన్నాయి?.. ఎంతమంది ఉంటున్నారు?.. ఇంటి స్థలం, నిర్మాణం ఎంతలో ఉంది?.. ఇన్కమ్ ట్యాక్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ఇలాంటి సాకులు చెబుతూ అధికారులు నల్లా బిల్లులను అందిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు అన్నదమ్ముళ్లు కలిసి ఉంటున్న బిల్డింగ్ కు ఒకే వాటర్ మీటర్ ఉంటే వారు ఈ స్కీమ్ కు అనర్హులంటూ అధికారులు బిల్లులు పంపిస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు.
శివార్లలోనూ అమలు చేయాలని..
గ్రేటర్ ఎన్నికల హామీలో భాగంగా జీహెచ్ఎంసీలో 20వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్‌ను జీహెచ్ఎంసీ అందిస్తోంది. శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా గ్రేటర్ తరహాలో ఫ్రీ వాటర్ అందించాలని అక్కడి జనం డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై వాటర్ బోర్డుకు డైలీ రిక్వెస్టులు వస్తున్నాయి. తమకు ఎందుకు అమలు చేయడం లేదంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
అవగాహన కల్పించకపోవడంతో..
ఫ్రీ వాటర్ కోసం ఆధార్ సీడింగ్, నల్లా మీటర్లపై వాటర్ బోర్డు అధికారులు వినియోగదారులకు అవగాహన కల్పించలేకపోయారు. కొందరు ఫ్రీ వాటర్ కోసం ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ వాటర్ బోర్డు సిబ్బంది బిల్లులను జారీ చేశారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా.. మీటర్ పనిచేయకపోవడంతో బిల్లులు జారీ వచ్చినట్లు చెబుతున్నారు. కనీసం కొత్త మీటర్లు పెట్టుకోవాలని కూడా క్షేత్ర స్థాయిలో అధికారులు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఇప్పటికీ వేలల్లో నల్లాలకు మీటర్లు పనిచేయట్లేదని సమాచారం. నల్లా మీటర్ లేని వారికి వాటర్ బోర్డు బిల్లులను అందిస్తూనే ఉంది. మీటర్లు బిగించాల్సిన సిబ్బంది కూడా ఈ విషయాన్ని పట్టించుకోకుండా నెలకోసారి వచ్చి బిల్లులను మాత్రం ఇస్తున్నారు.