- ప్రదానం చేసిన ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి నజ్మీ వజీరీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు అడ్వకేట్ బి.శ్రవంత్ శంకర్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన బిజినెస్ వరల్డ్ లీగల్ 40 అండర్ 40 అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి నజ్మీ వజీరీ, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా.. న్యాయ, వ్యాపార రంగాల మధ్య నిర్వహించే అత్యుత్తమ కాన్ క్లేవ్ ప్రోగ్రామ్‌గా దీన్ని భావిస్తుంటారు.
ప్రతి ఏటా దేశవ్యాప్తంగా 40 ఏండ్లలోపు వయస్సున్న 40 మంది ప్రముఖ అడ్వకేట్లను ఈ బిజినెస్ వరల్డ్ లీగల్ అవార్డుకు ఎంపిక చేస్తుంటారు. ఇందుకోసం సుదీర్ఘ నామినేషన్ ప్రక్రియ, ఇంటర్వ్యూల ఆధారంగా, సీనియర్ అడ్వకేట్లు, కార్పొరేట్ జనరల్ కౌన్సిల్లు, ప్రముఖ న్యాయ సంస్థల మేనేజింగ్ పార్ట్నర్‌లతో కూడిన సెలక్షన్ కమిటీ ఈ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తుందని మ్యాగజైన్ నిర్వాహకులు తెలిపారు.
వరల్డ్ లీగల్ 40 అండర్ 40 అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని శ్రవంత్ శంకర్ తెలిపారు. ఈ అవార్డుతో న్యాయవిభాగంలో తనకంటూ ప్రత్యేకత దక్కిందన్నారు. మరోవైపు, శంకర్ తండ్రి భూరం శంకర్ సైతం న్యాయ రంగంలో పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ గా, హైకోర్టు అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు.
