ఖమ్మం టౌన్, వెలుగు: జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డులపై పది రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని, ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీ డబ్ల్యూజేఎఫ్) జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. కానీ అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో మంత్రి ఫోన్ ద్వారా జర్నలిస్టులనుద్దేశించి మాట్లాడారు.
జర్నలిస్టుల అక్రెడిటేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకున్నదని, రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై సీఎంతో ఇప్పటికే చర్చించామని మంత్రి పేర్కొన్నారు.
గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన చిక్కుల వల్ల కొంత ఆలస్యమైందని, వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరఫున తీపి కబురు అందుతుందని చెప్పారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సంఘం నాయకులను, సభ్యులను మంత్రి అభినందించారు. ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ ఖదీర్‌ను ఎన్నుకున్నారు.
