- నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఆహార భద్రత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నాసిరకమైన ఆహార పదార్థాలు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని హోటళ్లలో నాన్ వెజ్, వెజిటేరియన్ కలిపి తయారు చేస్తున్నట్లు కంప్లైంట్లు వస్తున్నాయని తెలిపారు. ఆహార భద్రత విషయంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
హోటళ్లు, జూస్ స్టాళ్లు, పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు పాటించకుంటే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 157 హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేస్తున్న వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలించాలన్నారు. చిరు వ్యాపారుల వివరాలు సేకరించాలని, ఆహారం తయారు చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. శుభ్రమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించేలా చూడాలన్నారు.
వచ్చే సమావేశం వరకు జిల్లాలోని హోటళ్ల లైసెన్సులపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అమరేందర్, ఉమ్మడి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ రావు, డీఈవో రమేశ్ కుమార్, డీఎంహెచ్ వో రవికుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు శ్రీలత, నీలిమ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి..
రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 8 వేల ఫిట్నెస్ లేని వాహనాలు ఉన్నాయని, ఆ వెహికల్స్ ఓనర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. తనిఖీలు ముమ్మరం చేసి కఠినంగా వ్యవహరించాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహనదారుల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేయించాలని ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 18 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ సంగ్రామ్ సింగ్, డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవేర్నెస్ కల్పించాలి
వనపర్తి: వాహనదారులకు రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో సమవేశం నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్లకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రజలు, విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆర్అండ్ బీ ఈఈ దేశ్యా నాయక్, డీటీవో మానస, డీఎంహెచ్ వో సాయినాథ్ రెడ్డి, పీఆర్‌ఈఈ మల్లయ్య పాల్గొన్నారు.
