భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గతేడాది గోదావరికి వచ్చిన భారీ వరదలతో ఏజెన్సీలో రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. రాకపోకలు లేక మూడు నాలుగు రోజులు ప్రజలు పునరావాస కేంద్రాలకే పరిమితమయ్యారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనల రిపేర్ల కోసం దాదాపు రూ. 200కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మార్చి నెలలో రిపేర్ల కోసం కేవలం రూ. 37 కోట్లు ఇచ్చి సర్కార్ చేతులు దులుపుకుంది.
దాదాపు ఏడాది కావొస్తున్నా పూర్తి స్థాయిలో ఫండ్స్ రిలీజ్ కాకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే లో లెవల్ బ్రిడ్జిలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాకపోకలు స్తంభించాయి. మరో వైపు మూడేండ్లుగా చేసిన పనులకు సంబంధించిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆర్అండ్బీ పనులు చేపట్టాలంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు.
రూ. 37కోట్లిచ్చిన సర్కార్..
దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు, లో లెవల్ బ్రిడ్జిల స్థానంలో హై లెవెల్ బ్రిడ్జిల కోసం దాదాపు రూ. 200కోట్లతో ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపితే కేవలం రూ. 37కోట్లు సాంక్షన్ చేయడంతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేని పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 10 నుంచి 15 చోట్ల హై లెవల్ బ్రిడ్జిలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అశ్వాపురం మండలంలోని ఆమెర్ధ,అమ్మగారిపల్లి మధ్య గల బ్రిడ్జిపై, తుమ్మల చెరువు గ్రామం సమీపంలోని లోతువాగుపై వరద ఉధృతితో పది గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. గొందిగూడెం ఇసుక వాగుపై గల లో లెవల్ బ్రిడ్జితో, అమ్మగారిపల్లి, జగ్గారం మధ్య గల చప్టాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గుండాల మండలంలో కిన్నెరసాని ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు ఏజెన్సీ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాలేని పరిస్థితి. పినపాక, దుమ్ముగూడెం,అశ్వాపురం, చర్ల, గుండాల, పాల్వంచ, చండ్రుగొండ, అశ్వారావుపేట తదితర మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడడం కామన్‌గా మారింది. ఫండ్స్ ఇయ్యకపోతే ఆఫీసర్లు పనులెట్లా చేస్తారని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రశ్నించారు.
రూ. 100కోట్లకు పైగా బకాయిలు :
గతేడాది కొత్తగూడెం, ఇల్లెందు ప్రధాన రహదారిపై అనిశెట్టిపల్లి సమీపంలో దెబ్బతిన్న రోడ్డును రూ. 9లక్షలతో ఆర్అండ్బీ ఆఫీసర్లు యుద్ద ప్రాతిపదికన రిపేర్ చేశారు. ఏడాది కావొస్తున్నా పైసలు రాలేదు. ఇవే కాకుండా భద్రాచలంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనతో పాటు వరదల టైంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి దాదాపు రూ. 15 లక్షలు ఇవ్వలేదు. శ్రీరామ నవమి సందర్భంగా దాదాపు రూ. 10లక్షలతో చేపట్టిన పనులకు సంబంధించి ప్రభుత్వం పైసలియ్యలె. పాల్వంచలో దాదాపు వంద కోట్లతో చేపట్టిన మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు ఆర్నెళ్లుగా సాగుతున్నాయి.
దాదాపు రూ. 25 కోట్ల మేర పనిచేశారు. ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను జనవరి నెలలో కేసీఆర్ ఓపెనింగ్ చేశారు. పనులు పూర్తి అయినా దాదాపు రూ. 15కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. బిల్లులు టైంకు రాకపోవడంతో ఆర్అండ్బీలు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కేవలం కేంద్రం రిలీజ్ చేసే ఫండ్స్‌కు సంబంధించిన పనులకే కాంట్రాక్టర్లు మొగ్గు చూపుతున్నారు.