
- మెట్రోకు మొండి చెయ్యి.. జీహెచ్ఎంసీకి షాక్
- వాటర్‌వర్క్స్ డిపార్ట్మెంట్ ఆశలపై నీళ్లు
- హెచ్ఎండీఏకు కేటాయింపులు అంతంత మాత్రమే
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్మెంట్ కోసం ఏటా బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం ఈ సారి కూడా మొండిచెయ్యి చూపెట్టింది. కరోనా సాకుతో రెండేళ్లుగా సరిగా నిధులు కేటాయించని ప్రభుత్వం ఈసారి బడ్జెట్లోనూ గ్రేటర్‌ను పట్టించుకోలేదు. మెట్రో, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ల చేసే పనులకు కేటాయింపులు జరుగుతాయని ఆశించినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పులు చేస్తూ పనులను నెట్టుకొస్తున్న ఈ శాఖలు ఈసారి బడ్జెట్‌పై కొంత ఆశ పెట్టుకున్నాయి. రూ. 2,500 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపిన బల్దియాకి రూ.88.26 కోట్ల మాత్రమే దక్కాయి. వాటర్‌వర్క్స్ డిపార్ట్ మెంట్ కు రూ. 3 వేల కోట్లు కోరగా కేవలం రూ. 1,925 కోట్లు మాత్రమే అందాయి. మెట్రో రెండో దశ విస్తరణ (రాయదుర్గం–శంషాబాద్) కోసం 4,500 కోట్లు అవసరం కాగా కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు జరగక ఆ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. ఈ సారి బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కేటాయింపులు లేవు. హెచ్ఎండీఏ ప్రాజెక్టుల కోసం 8 వేల కోట్లు కనీసంగా అవసరం ఉండగా, ఈ బడ్జెట్లో రూ. 1,700 కోట్లు కేటాయించింది.
బల్దియాను పట్టించుకుంటలే
రాష్ట్రం ఏర్పడిన నుంచి ప్రభుత్వం జీహెచ్ఎంసీని పట్టించుకోవడం లేదని పౌర సంస్థలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డెవలప్మెంట్లో ఎంతో కీలకమైన బల్దియాకు ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. బల్దియాకి కేటాయించిన రూ.88.26 కోట్లలో జీతాల కోసం రూ. 7.83 కోట్లు,
జంటనగరాల్లో ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను, అద్దెల కోసం రూ.10 కోట్లు, నష్ట పరిహారాలు తదితర అవసరాల కోసం రూ.60.43 కోట్లు కేటాయించింది. కానీ ఎస్ఆర్డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్), డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం బల్దియా చేసిన అప్పులను తీర్చేందుకు ఎలాంటి కేటాయింపులు జరగలేదు. వీటితో పాటు నాలాల విస్తరణ తదితర అభివృద్ధ పనుల కోసం జీహెచ్ఎంసీకి భారీ నిధులు అవసరం అవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీపై రూ. 4,590 కోట్ల అప్పుల భారం ఉంది. రోజుకు రూ.కోటికిపైగా వడ్డీ చెల్లిస్తోంది. తాము అడిగిన 2,500 కోట్లలో కొంత ఆశాజనకమైన కేటాయింపులు జరుగుతాయని బల్దియా భావించింది. కానీ వాస్తవ అంకెలు చూసి బల్దియా అధికారులు షాక్‌కు గురైనట్లు సమాచారం. దీంతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 150 కోట్లు మాత్రమే కేటాయించింది.
వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్‌కి నామ్ కే వాస్తే..
లోన్ల చెల్లింపునకు రూ. 750 కోట్లు, కరెంట్ బిల్లుల కోసం రూ.500 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టు కోసం రూ.725 కోట్లు, ఫ్రీ వాటర్ స్కీమ్ కు రూ.300 కోట్లు, కేశవాపూర్ ప్రాజెక్టు, జోన్–3 మురుగునీటి వ్యవస్థ, కొత్త ఎస్టీపీలు(సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్లు), తదితర పనుల కోసం రూ.500 కోట్లు కావాలంటూ మొత్తం
రూ. 3 వేల కోట్లను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అడిగింది. కానీ సుంకిశాల ప్రాజెక్టు కోసం రూ.725 కోట్లు, లోన్లు కట్టేందుకు కోసం రూ.700 కోట్లు, ఫ్రీ వాటర్ స్కీమ్ కి రూ. 300 కోట్లు, వాటర్ బోర్డు అభివృద్ధి పనుల కోసం రూ.200 కోట్లను కేటాయించి ప్రభుత్వం చేతులు
దులుపుకుంది. ఇవి కాకుండా సిటీలో పాత డ్రైనేజీ సిస్టమ్ తొలగించి కొత్తగా నిర్మించేందుకు రూ.2 వేల కోట్లు అవసరముంది. దీనికోసం ఎలాంటి కేటాయింపులు జరగలేదు. ఓఆర్ఆర్ లోపల ఇంటింటికి నల్లాల కోసం మరో రూ.1200 కోట్లు కావాల్సి ఉండగా నిధులు ఇవ్వకపోవడంతో ఆ మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో వాటర్ వర్క్స్ అధికారులు ఉన్నారు.
మెట్రో విస్తరణ లేనట్లే..
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నా.. అది మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నాలుగున్నర వేల కోట్లు అవసరమైన ఈ ప్రాజెక్టు కోసం రూ. 500 కోట్ల కేటాయింపు మాత్రమే జరిగింది. ఓల్డ్ సిటీలో 5.5 కి.మీ మెట్రో నిర్మాణం కోసం రూ.500 కోట్ల కేటాయింపు జరిగింది. ఇతర అవసరాల కోసం మరో 1,500 కోట్ల కేటాయింపు జరిగింది. అయితే మెట్రో రైల్వేను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ ప్రాజెక్టు తొలి రోజుల నుంచి ఇప్పటి వరకు రూ.4 వేల కోట్లు నష్టపోయినట్లు ఇటీవల వెల్లడించింది. కరోనా కాలంలో ఒక్క ఏడాదిలోనే 1700 కోట్లు నష్టపోయామని చెప్పింది. ప్రభుత్వం ఆదుకోకపోతే తాము మెట్రోను నిర్వహించలేమని కొంత కాలం క్రితం తెగేసి చెప్పింది. దీంతో సర్కారు ఒక మంత్రుల కమిటీని కూడా వేసింది. మెట్రో బెయిల్ ఔట్ కోసం ఏదైనా చేస్తామని సర్కారు హామీ ఇచ్చినా బడ్జెట్లో అలాంటి కేటాయింపులు ఏమీ జరగలేదు. దీనికి తోడు కిందటి ఏడాది మెట్రో రైలుకి ప్రభుత్వం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. కానీ అందులో నయా పైసా కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఈ సారైనా నిధులు విడుదల జరుగుతుందా అనే సందేహంలో ఆ వర్గాలు ఉన్నాయి.
మూడేళ్ల నుంచి ఇంతే ..
మూడేళ్ల నుంచి బల్దియాకి ఫండ్స్ ఇస్తలేరు. అప్పులు చేసి పనులు చేస్తున్నారు. కానీ ఆ అప్పులను చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావడం లేదు. కోటికిపైగా జనాభా ఉన్న సిటీకి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోంది. రూ.10 వేల కోట్లు ఇస్తే బాగుండేది. గతంలో ఏటా ఇలా ఇస్తామని ప్రభుత్వం ప్రకటిం చినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కేటాయించడం లేదు. వాటర్‌బోర్డు, హెచ్ఎం డీఎ, మెట్రో రైల్ కి కేటాయించిన ఫండ్స్ ని అయినా సరైన విధంగా రిలీజ్ చేయాలె. - పద్మనాభరెడ్డి, సెక్రటరీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి...
అప్పుల్లో కూరుకుపోయిన బల్దియా.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. నెలలు గడుస్తున్నా ఇంకా చాలా మంది ఉద్యోగులకు పీఆర్సీ అమలు కావడం లేదు. టీఆర్ఎస్ సర్కార్ జీహెచ్ఎంసీని పట్టించుకోవడం లేదు. రూ.20 వేల కోట్లను స్పెషల్ ఫండ్స్ కింద ఇప్పటికైనా కేటాయించాలె.
- ఊదరి గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్
జీహెచ్ఎంసీకి అప్పులే....
గతంలో బల్దియాకు రూ.1600 కోట్ల మిగులు బడ్జెట్ ఉండేది. కానీ ఇప్పుడు డైలీ రూ.కోటి వడ్డీ కడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించాల్సి ఉంది. బస్తీ దవాఖానల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించేందుకు ఫండ్స్ఇవ్వాల్సి ఉంది. బస్తీల్లో ఇంగ్లీషు మీడియమని అన్నారు. దీని కోసం ఫండ్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ బిల్డింగ్‌లకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్‌లను పెండింగ్ లేకుండా చెల్లిం చినా బల్దియాకు రూ. వేల కోట్లు వస్తాయి.
- కొప్పుల నర్సింహారెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్
నారాజ్‌లో హెచ్ఎండీఏ
ప్యూచర్ సిటీకి రూపకల్పన చేసే బాధ్యతలో ఉన్న హెచ్ఎండీఏకు బడ్జెట్లో అంతంత మాత్రమే నిధులు దక్కాయి. ఓఆర్ఆర్ కి సంబంధించి జైకా లోన్లు చెల్లించేందుకు రూ. 350 కోట్లు, మూసీపై బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.540 కోట్లు, హిమాయత్ సాగర్ బ్యూటిఫికేషన్ కోసం రూ.250 కోట్లు, హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఇప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఎస్టీపీల నిర్మాణాల కోసం రూ.100 కోట్లు కేటాయించింది. రూ.5,916 వేల కోట్లు కావాల్సి ఉన్న మూసీ ఈస్ట్, వెస్ట్ కారిడార్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టింది. ఔటర్ చుట్టూ నిర్మించాల్సిన లాజిస్టిక్ పార్కులు, ఇతర డెవలప్మెంట్ పనుల కోసం హెచ్ఎండీఏకు భారీగా నిధులు అవసరమైనా సర్కారు మీద ఆశ పెట్టుకునే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారు.