ఇక సెలవు.. ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు

ఇక సెలవు.. ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు

హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందె శ్రీ ప్రస్థానం ముగిసింది. ఘట్‌కేసర్‌లోని ఎన్ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ అందె శ్రీ అంత్యక్రియలు ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు అందె శ్రీ అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సీఎం రేవంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా అందె శ్రీ పాడె మోసి కన్నీలు వీడ్కోలు పలికారు. అందరూ మౌనం పాటించగా.. గౌరవ సూచికంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం అందె శ్రీ పార్థివదేహాన్ని సమాధి చేశారు.

అంతకుముందు.. లాలాపేట్‌ నుంచి తార్నాక, ఉప్పల్‌ మీదుగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ వరకు జనసందోహం నడుమ అందె శ్రీ అంతిమయాత్ర కొనసాగింది. అందె శ్రీ అంతియ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, అభిమానులు, సాహితీ ప్రియులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. 500 మంది కళాకారులు యాత్ర సాగుతున్నంతసేపు ఆడిపాడారు. అమర్ రహే అందె శ్రీ అంటూ కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అభిమానుల ఆశ్రునయనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి.