ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలు.. రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహం

ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలు.. రెండు రోజులుగా ఇంట్లోనే మృతదేహం

ఆస్తిలో వాటా ఇస్తేనే దహన సంస్కారాలు నిర్వహించాలంటూ మృతదేహాన్ని రెండు రోజులుగా ఇంట్లోనే ఉంచి ఇంటికి కుటుంబ సభ్యులు తాళం వేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి .. పాల్వంచ పట్టణంలోని పేట చెరువు ప్రాంతంలో నివసిస్తున్న టీ. సమ్మయ్య భార్య మృతి చెందడంతో రత్తమ్మ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు . రత్తమ్మకు సంతానం కలగకపోవడంతో రవి అనే ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు . కాగా మొదటి భార్యకు ముగ్గురు కుమారులున్నారు.

సమ్మయ్య పదేళ్ల కిందట మృతి చెందారు. మృతి చెందే నాటికే తన ఆస్తిని మొదటి భార్య ముగ్గురు కుమారులతో పాటు రెండో భార్య రత్తమ్మ కొడుక్కి సమాన భాగాలుగా ఆస్తిని పంచారు. కాగా రత్తమ్మ(70) రెండు రోజుల కిందట అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. రత్తమ్మ కొడుకు రవికి కొంత మతిస్థిమితం సరిగా లేకపోవడంతో మొదటి భార్య కొడుకుల కన్ను రవి ఆస్తిపై పడింది. ఎకరం ఆస్తిలో వాటా ఇస్తేనే దహన సంస్కారాలు చేయనిస్తామని ఒత్తడి తెస్తూ రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టారు. ఆస్తి ఇవ్వకపోతే దహన సంస్కారాలు జరగనివ్వమంటూ పంచాయతీకి దిగారు.

ఎకరం పొలం గురించి ఎటూ తేల్చడం లేదంటూ రవి మృత దేహాన్ని వదిలి వెళ్లాడు. అందరూ ఉండి అనాధ శవంగా రత్తమ్మ మృత దేహం దహన సంస్కారాలకు నోచుకోకపోవడంపై గ్రామపెద్దలు సమ్మయ్య కొడుకులతో మాట్లాడినా పట్టించుకోక పోవడం గమనార్హం. గ్రామస్తులే దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో పోలీసులు చొరవ చూపారు. నలుగురు కొడుకులున్నా ఆస్తి ఇస్తేనే దహన సంస్కారాలంటూ కొడుకులు చేసిన నిర్వాహకంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.