34 ఏళ్లలో.. 57 సార్లు బదిలీ : ఈ IAS ఆఫీసర్ అంటే హడల్.. : అవినీతి మచ్చ లేకుండా రిటైర్ అయ్యారు..!

34 ఏళ్లలో.. 57 సార్లు బదిలీ : ఈ IAS ఆఫీసర్ అంటే హడల్.. : అవినీతి మచ్చ లేకుండా రిటైర్ అయ్యారు..!

IAS అధికారి అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్. 34 ఏళ్ల కెరీర్.. అందరికీ ఇలాంటిదే ఉంటుంది. అశోక్ ఖేమ్కా మాత్రం డిఫరెంట్. తన 34 ఏళ్ల సర్వీసులో.. 57 సార్లు బదిలీ అయ్యాడు. అంటే ఒక్క ఏడాది కూడా ఒక్క చోట ఉండలేదు. ఏడు, ఎనిమిది నెలలకే ట్రాన్స్ ఫర్ ఆర్డర్ తీసుకున్నారు. రూపాయి అంటే రూపాయి అవినీతి ఆరోపణలు అతనిపై లేవు.. బహుశా దేశంలోనే బెస్ట్.. సూపర్ ఐఏఎస్ అధికారి అంటే అశోక్ ఖేమ్కానే అని చెప్పొచ్చు.. ఆయన రిటైర్ అయ్యారు.. హర్యానా రాష్ట్ర రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు అశోక్ ఖేమ్కా. 

అశోక్ ఖేమ్కా వెలుగులోకి వచ్చిన ఘటన 2012లో జరిగింది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన గురుగ్రాం భూ ఒప్పందం మ్యుటేషన్ రద్దు చేయటం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో సంచలనం అయ్యారు. హర్యానా రాష్ట్ర కేడర్ లో పని చేస్తున్న అశోక్ ఖేమ్కా.. అవినీతిపై యుద్ధం చేయాలని చాలా చాలా తపించారు. అవినీతిని అస్సలు సహించని అతని నైజాన్ని జీర్ణించుకోలేకపోవటం వల్ల.. తరచూ బదిలీ అవుతూ ఉండేవారు. అశోక్ ఖేమ్కా బ్యాచ్ మేట్స్ అందరూ ఎన్నో ఉన్నతమైన పదవుల్లోకి వెళ్లినా.. ఆయన మాత్రం ప్రమోషన్స్ లేకుండా ఉండిపోయారు. 

12 ఏళ్లుగా.. అంటే 2013 నుంచి అశోక్ ఖేమ్కా తక్కువ స్థాయి పోస్టుల్లోనే పని చేశారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఆయన నాలుగు సార్లు పురావస్తు శాఖకు బదిలీ చేయబడ్డారు. అక్కడ పని లేదని భావించిన ఆయన.. హర్యానా సీఎం ఖట్టర్ కు లేఖ రాసి సంచలనం రేపారు.

Also Read : గేల్, డివిలియర్స్‌లను బౌల్డ్ చేశాను.. 

నా జీవిత కాలంలో అవినీతి రహిత సమాజం చూడాలనేది నా కల. అవినీతిని రూపుమాపటానికి విజిలెన్స్ విభాగానికి నాయకత్వం వహించటానికి అవకాశం కల్పించండి.. అవినీతిపై యుద్ధం చేస్తాను.. ఎంత ఉన్నతమైన, శక్తివంతమైన వ్యక్తిని సైతం వదిలపెట్టను అంటూ సీఎంకు లేఖ రాశారు. ఈ లేఖ పెద్ద చర్చకు దారి తీసింది. ఇంతకీ అశోక్ ఖేమ్కాకు విజిలెన్స్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారా అంటే.. అస్సలు లేదు. ఆయన్ను అక్కడి నుంచి రవాణా శాఖ అదనపు కార్యదర్శిగా నియమించింది హర్యానా బీజేపీ ప్రభుత్వం.

ఐఏఎస్ అశోక్ ఖేమ్కా చాలా సందర్భాల్లో తన మనసులోని మాటను బయట పెట్టారు. తన బ్యాచ్ మేట్స్ అందరూ కార్యదర్శులుగా ముందుకు వెళుతుంటే గర్వంగా ఉంది.. ఒకరు వెనకబడిపోయినందుకు అదే స్థాయిలో నిరాశ తెస్తుంది అంటూ తన పరిస్థితి గురించి చెప్పకనే చెబుతూ వచ్చారు. మోదీ ప్రభుత్వం వచ్చిన ఈ 11 ఏళ్ల కాలంలోనూ అశోక్ ఖేమ్కా ఆశయాలు, లక్ష్యాలను సాధించటానికి అవకాశం కల్పించలేకపోయింది.

తన 34 ఏళ్ల కెరీర్ లో ఒక్క రూపాయి అవినీతి ఆరోపణలు, విమర్శలు, మరకలు లేకుండా.. 57 సార్లు బదిలీ అయ్యి.. చివరకు 2025, ఏప్రిల్ 30వ తేదీన పదవీ విరమణ చేశారు. ఇతని సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్. కోల్ కతాలో పుట్టారు. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ లో ఎంబీఏ చేశారు. టీఐఎఫ్ఆర్ నుంచి పీహెచ్ డీ కంప్లీట్ చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవాది డిగ్రీ కూడా అందుకున్నారు. 

ఇంత నాలెడ్జ్, ఇంత విశ్వసనీయత.. ఇంత నిజాయితీ.. ఇంత జాతీయవాదం.. ఇంత కచ్చితత్వం ఉంటే ఈ భారతదేశంలో.. ఈ రాజకీయాల్లో ఎలా నెట్టుకొస్తారు.. నెట్టుకురాలేరు అనటానికి అశోక్ ఖేమ్కా జీవితమే ఎగ్జాంపుల్. కాకపోతే ఒక్కటి ఉంటుంది.. అది ఆత్మ సంతృప్తి.. మిగతా వాళ్లకు లేనిది.. అశోక్ ఖేమ్కాకు ఉన్నది ఈ ఆత్మ సంతృప్తి.. జీవితంలో హ్యాపీకి ఇదే కదా.. అవినీతి రహిత సమాజాన్ని సాధించలేకపోవచ్చు.. తన వంతుగా మాత్రం బాధ్యతగా వ్యవహరించి.. కొందరికి అయినా ఆదర్శంగా ఉన్న అశోక్ ఖేమ్కాకు హ్యాట్సాప్ కదా..