భర్త అనుకుని మరో వ్యక్తి బైక్ ఎక్కిన మహిళ..

భర్త అనుకుని మరో వ్యక్తి బైక్ ఎక్కిన మహిళ..

అప్పుడప్పుడు ఒకేలా ఉన్న వస్తువులు తారుమారవడం చూస్తుంటాం.. కానీ ఇక్కడ మాత్రం భార్యాభర్తలు తారుమారయ్యారు. కర్నాటక రాష్ట్రంలోని హావేరి జిల్లా రాణేబెన్నూరులో ఓ గమ్మతైన సంఘటన జరిగింది. దాదాపు ఒకే రకమైన రెండు బైక్‌లు ఒకే సమయంలో పెట్రోల్ బంక్‌కు వచ్చాయి. ఆ రెండు బైక్‌లు నడుపుతున్న వ్యక్తులు, వారి భార్యలు హెల్మెట్ పెట్టుకుని ఉన్నారు. అంతేకాదు సదరు మహిళలిద్దరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకున్నారు. పెట్రోల్ కొట్టించిన తర్వాత ఓ వ్యక్తి  బైక్‌ స్టార్ట్‌ చేయగానే అక్కడే వేచిచూస్తున్న మహిళల్లో ఒకరు బైక్ ఎక్కారు. 

బండిపై కొంతదూరం వెళ్లాక తమ ఇంటికి వెళ్లే మార్గంలో కాకుండా వేరే రూట్ లో  బైక్‌ వెళ్లడాన్ని గమనించిన సదరు మహిళ  ‘ఏమండీ మన ఇళ్లు ఇటు కాదు కదా! ఇటెందుకు వెళ్లున్నారని’ భర్తను ప్రశ్నించింది. బైక్‌ నడుపుతున్న వ్యక్తి తన భార్య గొంతు వేరేలా ఉండటంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే బైక్‌ ఆపి చూస్తే ఆమె తన భార్య కాదని గ్రహించి మళ్లీ పెట్రోల్‌ బంక్‌కు తిరిగి వచ్చారు. అక్కడే వెయిట్ చూస్తున్న మిగతా ఇద్దరూ వారిని చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నలుగురు ఒకరి ముఖం మరొకరు చూసుకుని నవ్వుకున్నారు.