
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీపై కొందరు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని.. ఇక్కడ నాకు భూములు ఉన్నందు వల్లే ఫ్యూచర్ సిటీ కడుతున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ ఫ్యూచర్ సిటీ నా కోసం కాదు భవిష్యత్ తరాల కోసమని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం (సెప్టెంబర్ 28) సీఎం రేవంత్ ఫ్యూచర్‌సిటీకి శంకుస్థాపన చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూర్మండలం మీర్ఖాన్పేటలో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) భవన నిర్మాణానికి ఆయన పునాదిరాయి వేశారు. అలాగే రావిర్యాల నుంచి ఆమనగల్వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్రేడియల్ రోడ్–1 నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఒక మంచి ఆలోచనతో ఫోర్త్ సిటీ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ఈ బృత్తతర కార్యక్రమానికి వరుణుడు కూడా సహకరించాడని అన్నారు.చంద్రబాబు, వైఎస్ఆర్ ముందుతరాల కోసం ఆలోచించారని.. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ వచ్చాయన్నారు. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలని అన్నారు.
దేశంలో చాలా మంది విదేశాలకు వెళ్లి వచ్చి అక్కడ అద్భుతంగా ఉందని చెబుతుంటారు.. ఎన్నాళ్లు మనం న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి మాట్లాడుకుంటాం.. మనం కూడా అలా తయారు కావాలి కదా అన్నారు. నాకు పదేళ్లు సమయం ఇవ్వండి న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతానని పేర్కొన్నారు. 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా అని అన్నారు.
హైదరాబాద్‌ను న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తానని.. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తానన్నారు. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదని అన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నామని.. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కూడా కేంద్రాన్ని ఒప్పించామని తెలిపారు. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుందని పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని.. కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోవొద్దని.. ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని భూనిర్వాసితులకు సూచించారు.