
హైదరాబాద్, వెలుగు: రైతుబంధును నిలిపి వేయాలంటూ తాను ఈసీకి లేఖ రాశానని మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ ఖండించారు. తాను ఈసీకి రాసిన లేఖలో ఎక్కడా రైతుబంధును నిలిపేయాలని కోరలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు సహాయంపై బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని మాత్రమే తాను కోరానని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎన్నికల కమిషన్ రైతుబంధుకు అనుమతినిస్తూ.. దానిపై ఎక్కడా ప్రచారం చేయొద్దని ఆంక్షలు పెట్టిందని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్ రూల్స్‌ను ఉల్లంఘించి బహిరంగ సభల్లో హరీశ్ గొప్పలకు పోయారని విమర్శించారు. ఈసీ తమ అనుమతిని వెనక్కి తీసుకోవడానికి హరీశ్ రావు వ్యాఖ్యలే కారణమన్నారు. కాగా, రైతుబంధు నిలిచిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనేనంటూ కేసీఆర్, హరీశ్ రావు ఆరోపిస్తున్నారని, ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయకుండా వారికి ఆదేశాలివ్వాలని ఈసీకి ఆయన లేఖ రాశారు.