బీఆర్‌‌ఎస్‌ ఖేల్‌ ఖతం.. ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు : వివేక్‌ వెంకటస్వామి

బీఆర్‌‌ఎస్‌ ఖేల్‌ ఖతం..  ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు : వివేక్‌ వెంకటస్వామి
  • బీఆర్‌‌ఎస్‌ ఖేల్‌ ఖతం 
  • ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావు.. కాంగ్రెస్‌ స్వీప్‌ చేస్తది: వివేక్‌ వెంకటస్వామి
  • కాళేశ్వరం పేరిట కేసీఆర్‌‌ రైతులను ఆగం జేసిండు.. లక్ష కోట్లు తిన్నడు 
  • ఎమ్మెల్యే బాల్క సుమన్​కు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరిక​
  • చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం

కోల్ బెల్ట్/మంచిర్యాల, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ చెన్నూరు అభ్యర్థి, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయ్యిందని, ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి, మందమర్రి మున్సిపాలిటీలోని 2, 8, 16, 20 వార్డుల్లో కుమారుడు గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి వివేక్​ ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం చేరికల సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘తుగ్లక్‌ కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని తన కల్వకుంట్ల ఫ్యామిలీనే బంగారు కుటుంబం చేసుకున్నడు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో రైతులను ఆగం చేసి, రూ.లక్ష కోట్లు దండుకున్నడు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడితే ఆయన ఇంట్లోనే ఆరుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నడు’’అని విమర్శించారు. 

ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనన్న కేసీఆర్.. పాత వాటర్ ట్యాంకులకు రంగులద్ది ఇవే మిషన్ భగీరథ ట్యాంకులు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వాళ్లకు టెండర్లు ఇస్తే.. 30 శాతం కమీషన్ రాదని ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇస్తున్నారని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ పేరిట రూ.40 వేల కోట్లను కేసీఆర్‌‌ దోచుకున్నారన్నారు. చిన్న రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనుకుంటే కేసీఆర్ అవినీతిమయం చేశారన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌‌తో చెన్నూర్ నియోజకవర్గం మునుగుతుంటే పట్టించుకోలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్‌లు ఇవ్వలేదు కానీ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సడ్డకుని కుమారుడికి ఒకొక్కరికి 100 ఎకరాల్లో ఫామ్ హౌస్‌లు కట్టించారని ఆరోపించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అవినీతి, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలతో నియోజకవర్గ ప్రజలు విసుగు చెందారని వివేక్‌ అన్నారు. చెన్నూరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే ఈ ఎన్నికల్లో బాల్క సుమన్‌ను ఓడించి, ఆయనకు బుద్ధి చెప్తారన్నారు. 

కేసీఆర్‌‌ను బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరపడ్డయ్..

‘‘బాల్క సుమన్.. నిన్ను నమ్ముకుని ఇన్నాళ్లు వెంట తిరిగిన కార్యకర్తలను బట్టలూడదీసీ కొడ్తానని బెదిరిస్తున్నావు. నువ్వు చేసే ఇసుక దందా చూసి నీ తండ్రిలాంటి కేసీఆర్‌‌ను కూడా బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరపడ్డాయి. ఖబడ్దార్.. మర్యాదగా, సభ్యతతో మాట్లాడడం నేర్చుకో”అంటూ వివేక్‌ సూచించారు. వంద కేసులు ఉన్న బాల్క సుమన్‌కు రూ.వెయ్యి కోట్లు ఏడికెళ్లి వచ్చాయని ప్రజలు నిలదీయాలన్నారు. కాళేశ్వరంతో కేసీఆర్ కమీషన్లు తీసుకుంటే, ల్యాండ్, సాండ్, కోల్ మాఫియా ద్వారా బాల్క సుమన్‌ రూ.2 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. 

బాల్క సుమన్ అహంకారి: నల్లాల ఓదెలు 

‘‘బాల్క సుమన్ అహంకారి. కార్యకర్తలను, లీడర్లను, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. నియంతృత్వ పాలన చేస్తున్నాడు. ఈ ఎన్నికలు అహంకారి సుమన్‌కు, మానవత్వం ఉన్న వివేక్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో ప్రజలు మానవత్వానికే పట్టం కడతారు. సుమన్ గెలిస్తే నెత్తి మీద ఉంటాడు, వివేక్ గెలిస్తే జనం గుండెల్లో ఉంటాడు” అని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యోగులు, రైతులు, జనం చనిపోవద్దని, పార్లమెంట్‌లో గళం విప్పిన వ్యక్తి వివేక్ అని గుర్తుచేశారు. వారి కుటుంబమంతా ప్రజా సేవలోనే ఉంటున్నారని తెలిపారు. కాకా వెంకటస్వామి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని కొనియాడారు. 

క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి, మందమర్రి మార్కెట్‌లోని మజీద్ ఆవరణలో మైనారిటీల సమావేశం జరిగింది. దీపక్ నగర్, గ్యారేజ్ లైన్, పాలచెట్టు ఏరియా 8వ వార్డు, యాపల్ ప్రాంతాల్లో పలువురు బీఆర్‌‌ఎస్‌ లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. వీరికి వివేక్, ఓదెలు, వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దరాగడి అమ్మ గార్డెన్ రోడ్డులో కాంగ్రెస్ ఎలక్షన్ ఆఫీస్‌ను ప్రారంభించారు. 

ప్రజల కోరిక మేరకే బరిలోకి.. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయ్యిందని, ఆ పార్టీకి 20 సీట్లు కూడా రావన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని తన నివాసంలో బెల్లంపల్లి, మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం వినోద్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఏఐసీసీ అబ్జర్వర్ మహేశ్‌ జోషితో కలిసి వివేక్ మీడియాతో మాట్లాడారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడితే జీరో గ్రావిటీతో లక్షల ఎకరాలు సాగయ్యేవని, కానీ, కాళేశ్వరం కట్టి కేసీఆర్‌‌ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని తెలిపారు. ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే తాను ఎమ్మెల్యేగా బరిలోకి దిగానని చెప్పారు. మహేశ్‌ జోషి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు. ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. వినోద్ మాట్లాడుతూ.. బెల్లంపల్లి, చెన్నూర్ అభ్యర్థులు సూట్ కేసులతో వచ్చారన్న కేసీఆర్ కామెంట్లను ఖండిస్తున్నానన్నారు. తాము బిజినెస్ చేసి సంపాదించామని, ఆయన లాగా రాష్ట్రాన్ని దగా చేసి దోచుకోలేదని ఫైర్ అయ్యారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెండుసార్లు గెలిచినా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. బెల్లంపల్లి, చెన్నూరు టికెట్లు ఆశించిన నూకల రమేశ్, న్యాతరి స్వామి కాంగ్రెస్ అభ్యర్థులు వినోద్, వివేక్‌కు మద్దతు ప్రకటించారు. 

మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తా..

తన తండ్రి కాకా వెంకటస్వామి కాలం నుంచి మైనారిటీలతో మంచి అనుబంధం ఉందని వివేక్ తెలిపారు. మైనారిటీలు చూపించే ప్రేమ మాటల్లో చెప్పలేనన్నారు. ముస్లిం సంప్రదాయ వంటకాలు తమ ఇంట్లో భాగమయ్యాయని, తమ సంస్థల్లో మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. బాల్క సుమన్‌కు ఏ సామాజిక వర్గమైనా చిన్నచూపేనని మండిపడ్డారు. చెన్నూర్ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానని వివేక్‌ హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు మంచి నీళ్లకు గోస పడుతుంటే.. గోదావరి నుంచి మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు రూ.24 కోట్లతో శాశ్వత నీటి పథకం తీసుకొచ్చిన ఘనత తన తండ్రి కాకా వెంకటస్వామికే దక్కుతుందన్నారు. సింగరేణి సిక్ ఇండస్ట్రీస్ పరిధిలోకి వెళ్లినప్పుడు కేంద్రం నుంచి మారిటోరియం ఇప్పించి కార్మికులకు కాకా భరోసా కల్పించారని గుర్తుచేశారు.