- హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా మూడు రోజుల పాటు సమావేశాలు
- 40 దేశాల నుంచి ప్రతినిధుల రాక
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ వేదికగా జీ20 ఆర్థిక సదస్సు శనివారం ప్రారంభమైంది. నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఇండియా అధ్యక్షతన ‘గ్లోబల్ పార్ట్ నర్ షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్ (జీపీఎఫ్ఐ)’ థీమ్ తో తొలి విడత సమావేశాలు గత జనవరిలో కోల్కతాలో జరిగాయి.ఇప్పుడు రెండో విడత సమావేశాలు హైదరాబాద్ వేదికగా ప్రారంభమయ్యాయి. సదస్సుకు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఆయా దేశాల అనుభవాలు, విజయగాథలపై సదస్సులో చర్చించనున్నారు. మొదటి రోజు బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, ఇథియోపియా, భూటాన్, ఈజిప్ట్, శ్రీలంక, థాయిలాండే, వియత్నాం తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఎకనామిక్ గ్రోత్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాల పై ఈ సందర్భంగా చర్చించారు. ముఖ్యంగా ఆధార్, యూపీఐ, డిజిటల్ ట్రాన్సాక్షన్ పై ప్రత్యేక డెమోలు ఇచ్చారు. జీ20లో ఉన్న దేశాలు మాత్రమే కాకుండా, ఆసక్తి ఉన్న ఇతర దేశాలు కూడా పాల్గొన్నాయి. ఈ ఏడాది జీ-20 దేశాల సదస్సులకు ఇండియా నేతృత్వం వహిస్తున్నందున ఇప్పటి వరకు 25 నగరాల్లో 36 సదస్సులు నిర్వహించారు.
భారత్ కు ఎదురులేదు: హర్షవర్ధన్ శ్రింగ్లా
సదస్సు ప్రారంభం సందర్భంగా జీ20 చీఫ్ కొర్డినేటర్ హర్ష వర్ధన్ శ్రింగ్లా మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు ఇండియా ఎకనామిక్ గ్రోత్ కు మరింత ఊతమిస్తాయని అన్నారు. డిజిటల్ ఎకానమీ విషయంలో ఇండియా ఎన్నో విజయాలను సాధించిందన్నారు. ‘‘భౌగోళిక -రాజకీయ ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభాలు, కరోనా వంటి సమస్యలు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వీటి పరిష్కారానికి అనుభవాలను, నాలెడ్జ్ ను పంచుకోవడం చాలా ముఖ్యం. అన్ని దేశాలు ఒకేతాటిపైకి వస్తే ఆర్థిక పునరుద్ధరణ సాధ్యమవుతుంది. ఇందుకోసం నాలెడ్జ్ ఎక్చేంజ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది జీ20 నిర్వహణ బాధ్యత మన చేతికి వచ్చినందున మన గొంతును ప్రపంచానికి మరింత గట్టిగా వినిపిస్తాం” అని ఆయన తెలిపారు.
