అందరికీ ఆర్థిక సేవలు.. ఆరేండ్లలోనే అందినయ్

అందరికీ ఆర్థిక సేవలు..   ఆరేండ్లలోనే అందినయ్
  • జన్‌‌ ధన్‌‌ అకౌంట్‌‌లు, ఆధార్‌‌‌‌, సెల్‌ ఫోన్లు లేకుంటే 5 దశాబ్దాలు పట్టేది:  వరల్డ్ బ్యాంక్‌
  • 2022-23 లో జరిగిన మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ జీడీపీలో సగం
  • ఈ-కేవైసీతో బ్యాంకులు చేసే ఖర్చు భారీగా తగ్గిందని వెల్లడి

న్యూఢిల్లీ: జన్‌‌ ధన్‌‌  బ్యాంక్ అకౌంట్లు,  ఆధార్‌‌‌‌, మొబైల్‌‌ ఫోన్లు వంటి డిజిటల్‌‌ పేమెంట్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్స్ (డీపీఐ) లేకపోయి ఉంటే   ఫైనాన్షియల్ ఇన్‌‌క్లూజన్‌‌ (అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులో ఉండడం) సాధించడానికి ఇండియాకు ఏకంగా 47 ఏళ్లు పట్టేదని, వీటి సాయంతో కేవలం ఆరేళ్లలోనే  చేరుకుందని జీ20 పాలసీ డాక్యుమెంట్‌‌లో వరల్డ్ బ్యాంక్  పేర్కొంది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్‌‌క్లూజన్‌‌లో 80 శాతాన్ని ఇండియా సాధించిందని వెల్లడించింది.  2022–23 లో జరిగిన  మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ దేశ నామినల్‌‌ జీడీపీలో 50 శాతంగా ఉందని  పేర్కొంది.  ‘డిజిటల్ పేమెంట్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌తో ( ఆధార్‌‌‌‌, డిజీలాకర్‌‌‌‌ వంటివి) బ్యాంకులు ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి జరిపే ఖర్చు 23 డాలర్ల (రూ.1,900)  నుంచి 0.1 డాలర్‌‌ ( రూ.8) ‌‌కు దిగొచ్చింది. అర్హులకు  ప్రయోజనాలను డైరెక్ట్‌‌గా వారి బ్యాంక్‌‌ అకౌంట్లకే వేయడం ద్వారా  కిందటేడాది మార్చి నాటికి 33 బిలియన్ డాలర్ల (రూ.2.74 లక్షల కోట్ల) ను ప్రభుత్వం ఆదా చేయగలిగింది.  ఇది నామినల్‌‌  జీడీపీలో 1.14 శాతానికి సమానం’ అని వరల్డ్‌‌ బ్యాంక్  రిపోర్ట్‌‌  వెల్లడించింది. డిజిటల్ పేమెంట్స్‌‌, ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌‌లో సాధించిన విజయాలను శనివారం నుంచి జరగనున్న జీ20 సమ్మిట్‌‌లో ప్రభుత్వం ప్రదర్శించనుంది.

ఈజీ యూపీఐ..

దేశంలో యూపీఐ వాడకం రోజు రోజుకి పెరుగుతోందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ‘యూపీఐ వంటి  ఫాస్ట్‌‌ పేమెంట్‌‌ సిస్టమ్‌‌ (ఎఫ్‌‌పీఎస్‌‌)  డిజిటల్ పేమెంట్స్‌‌ రూపురేఖలను  మార్చేసింది. యూపీఐ యూజర్ ఫ్రెండ్లీ. ఇండియాలో వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది మేలో రూ.14.89 లక్షల కోట్ల విలువైన 941 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. అదే  2022–23 మొత్తం ఆర్థిక సంవత్సరం తీసుకుంటే  యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఇండియా నామినల్‌‌ జీడీపీలో 50 శాతంగా ఉంది’ అని  వివరించింది.  డీపీఐల వలన  ప్రైవేట్‌‌ ఆర్గనైజేషన్లలో ఎఫీషియెన్సీ పెరిగిందని,  బిజినెస్ ఆపరేషన్స్‌‌ కోసం కంపెనీలు కేటాయింటే టైమ్‌‌ తగ్గిందని, పేమెంట్స్‌‌ ఈజీగా మారాయని, వీటి కోసం చేసే ఖర్చు తగ్గిందని  వెల్లడించింది.

ఇండియా ఏం సాధించిందంటే?

డిజిటల్‌‌ పేమెంట్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ (డీపీఐ) ను వాడుకోవడంలో  ఇండియా అద్భుతంగా పనిచేసిందని వరల్డ్‌‌ బ్యాంక్ కొనియాడింది. వివిధ బ్యాంకుల మధ్య పేమెంట్లు,  డిజిటల్ డాక్యుమెంట్లను దాచుకునేందుకు లెడ్జర్‌‌, ఆధార్ ‌‌ వంటి డీపీఐలను సమర్ధవంతంగా ఉపయోగించుకుందని తెలిపింది.  కాగా,  2015 మార్చిలో  జన్‌‌ ధన్‌‌ యోజన  కింద  ఓపెన్ అయిన బ్యాంక్‌‌ అకౌంట్‌‌లు 14.72 కోట్లు ఉండగా, కిందటేడాది జూన్ నాటికి 46.20 కోట్లకు పెరిగాయి. వీటిలో 56 శాతం అకౌంట్‌‌లు మహిళలకు చెందినవి. అంటే 26 కోట్ల అకౌంట్లు. ఇంతలా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అవ్వడంలో డీపీఐల పాత్ర కీలకంగా ఉంది. బ్యాంక్‌‌లు ఆధార్‌‌‌‌, డిజిలాకర్‌‌‌‌ వంటి డిపీఐలను సమర్ధవంతంగా వాడుతున్నాయి.