Defence Stock: ఫ్రెంచ్ సంస్థతో డ్రోన్ మేకర్ ఒప్పందం.. ఆ కిల్లర్ డ్రోన్స్ ఇండియాలో తయారీ!

Defence Stock: ఫ్రెంచ్ సంస్థతో డ్రోన్ మేకర్ ఒప్పందం.. ఆ కిల్లర్ డ్రోన్స్ ఇండియాలో తయారీ!

Bharat Forge Shares: నేటి కాలంలో యుద్ధం తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు బోర్డర్ దాటకుండా.. సైనికులు నేరుగా పోరాడకుండానే యుద్ధాలు జరుగుతున్నాయి. పైగా ఇటీవలి వార్స్ చూస్తుంటే డ్రోన్ల వినియోగం చాలా కీలకంగా మారింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టాలను కలిగించటంలో ఇవి సమర్థతను ప్రదర్శించటం డిఫెన్స్ రంగంలో వీటికి ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయ డిఫెన్స్ కంపెనీలు వరుస ఆర్డర్ల ఒప్పందాలతో బిజీబిజీగా బిజివెస్ చేసుకుంటున్నాయి. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది భారత్ ఫోర్జ్ కంపెనీ గురించే. కంపెనీ భారత రక్షణ మంత్రిత్వ శాఖకు AAROK యూఏవీలను అందించడానికి ఫ్రెంచ్ కంపెనీ టెర్గిస్ గైలార్డ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇవి మానవరహిత వాహనాలు. ఈ ప్రకటన తర్వాత డ్రోన్ తయారీ సంస్థ భారత్ ఫోర్జ్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో పెరుగుదలను నమోదు చేశాయి. మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో ఒక్కోటి రూ.1294 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. 

AAROK యూఏవీల ప్రత్యేకతలు..
AAROKలు మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ (MALE) కేటగిరీ యూఏవీలు. ఇవి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికత, పనితీరును కనబరచటంలో ప్రసిద్ధి చెందాయి. ఇవి ఎక్కువ ఎత్తుల్లో, ఎక్కువ దూరం ప్రయాణిస్తూ శత్రు కదలికలపై నిఘా పెట్టే సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఉండే విద్యుదయస్కాంత సెన్సార్లు, రాడార్ శత్రువులను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయి. పైగా దీని కంట్రోల్ సిస్టమ్స్ ఇతర సైనిక పరికరాలతో అనుసంధానించటం చాలా సులువు. 24 గంటల పాటు ఎగరగలిగే సామర్థ్యం కలిగిన డ్రోన్ దాదాపు 1.5 టన్నుల పేలోడ్ తీసుకువెళ్లగలదని భారత్ ఫోర్జ్ పేర్కొంది. శత్రు భూభాగంలోకి వెళ్లి వారి డిఫెన్స్ పరికరాలపై దాడులు చేయగలిగిన సామర్థ్యాలు దీని సొంతం కావటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. 

ఫ్రాన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్ ఫోర్జ్ దేశంలో AAROK ఉత్పత్తికి ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయంగా మిలిటరీ అవసరాలను తీర్చటంలో దోహదపడుతుందని కంపెనీ చెప్పింది. కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా కంపెనీ వాటి మెయింటెనెన్స్, సర్వీసింగ్ సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.