గ్రాఫ్ బాగాలేకపోతే పీకేస్తా.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

గ్రాఫ్ బాగాలేకపోతే పీకేస్తా.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. దీనిపై తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వంపై సిద్దం చేసిన సర్వే ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించారు.  కొంతమంది ఎమ్మెల్యేల పనితీరును మార్చుకోవాలని హెచ్చరించారు. 

అసెంబ్లీ ఎన్నికలకు రానున్న తొమ్మిది నెలలే కీలకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల వ్యక్తిగత ప్రదర్శనలతోనే ఎక్కువగా ప్రభావితమవుతారని సీఎం జగన్ అన్నారు. మెచ్చుకోదగిన పనితీరును ప్రదర్శించినవారే వారి  స్థానాలను నిలుపుకుంటారని సీఎం జగన్ పరోక్షంగా హెచ్చరించారు.

 18 మంది ఎమ్మెల్యేలు ....

18 మంది ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమంలో తిరగలేదని సీఎం జగన్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. వచ్చే సమీక్ష నాటికి వారు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆ 18 మంది ఎమ్మెల్యేలను తాను పిలిచి మాట్లాడతానని జగన్ అన్నారు.  ఎండలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు బాగా తిరగలేదని తెలిసిందని జగన్ అన్నారు. ఇప్పటినుంచి  అయినా బాగా తిరగాలని సూచించారు. గ్రాఫ్‌ పెరిగితేనే టికెట్లు అని సీఎం జగన్ స్పష్టం చేశారు.పనితీరు మెరుగుపరుచుకోకుంటే సీట్లు కూడా హెచ్చరించారు. అయితే గడప గడపకు కార్యక్రమంలో పనితీరు కనబరచని ఆ ఎమ్మెల్యేలు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. 

జగనన్న సురక్ష

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా తీసుకొస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం గురించి ఈ సందర్భంగా సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దాదాపు నెలపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జగనన్న సురక్షలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజింగ్ గా తీసుకోవాలని చెప్పారు. ఏయే పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని సూచించారు. వచ్చే సమావేశానికి పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు.అందరూ కష్టపడి 175కి 175 సీట్లను గెలుచుకుందామని చెప్పారు.

జూలై 1 నుంచి ప్రత్యేక క్యాంపులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులను నిర్వహించనుంది. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ క్యాంపుల్లో 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ( జూన్ 21)  గ్రామ , వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు.. ఈ క్యాంపుల్లో అందించే సేవలకు ఎలాంటి రుసుములను వసూలు చేయబోమని పేర్కొంది.

మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా సమస్యల పరిష్కారానికి ఈ నాలుగు వారాల పాటు క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 24 నుంచి ఈ కార్యక్రమంపై వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని ప్రభుత్వం చెప్పింది. 

క్యాంపుల్లో అందించే సేవలు , జారీ చేసే సర్టిఫికెట్లు ఇవే 

* కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు
* డేట్‌ ఆఫ్‌ బర్త్‌, డెత్ సర్టిఫికేట్లు
* మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌
-* మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్‌
* మ్యారేజ్ సర్టిఫికెట్ 
* ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు
* ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌
* కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)
* కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన
* కుటుంబ వివరాల్లో సభ్యుల పేర్ల తొలగింపు 
* వినతుల స్వీకరణ, రిజిస్ట్రేషన్లు, వెరిఫికేషన్