- వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో ఆయా చోట్ల గడ్డపారతో ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ రాజేశ్చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న తాడ్వాయి మండలం చిట్యాలలో మసులా శ్రీనివాస్ ఇంట్లో చోరీ జరిగినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎంక్వైరీ చేయగా గడ్డ పార దొంగల ముఠా పట్టుబడిందన్నారు.
దొంగలు ప్రయాణించిన మార్గంలోని సీసీ కెమెరాలను పరిశీలించామన్నారు. దొంగలు ఉపయోగించిన టూ వీలర్ రిజిస్ర్టేషన్ నంబర్ ఆధారంగా కొంత సమాచారం లభించిందన్నారు. ఈ ముఠా సభ్యులపై నిఘా పెట్టి ఉంచామన్నారు. తాడ్వాయిలో ఎస్సై ఆధ్వర్యంలో వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఈ గ్యాంగ్ పట్టుబడినట్లు తెలిపారు. వీరు గత కొంత కాలంగా తాడ్వాయి, గాంధారి, లింగంపేట, రాజంపేట, బాన్సువాడ మండలాల్లో చోరీలకు పాల్పడుతున్నారన్నారు. తాళాలు వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని రాత్రి వేళల్లో గడ్డ పారతో తాళాలు పగుల గొట్టి చోరీలు చేస్తున్నారన్నారు.
పట్టుబడిన వారిలో మస్సి జోధ్రాజు ( గుర్జాల్‌తండా, గాంధారి మండలం), అంకుష్ ప్రేమ్‌సింగ్ సాబలే ( గుర్జాల్‌తండా), బామన్ మహేందర్ ( చెన్నాపూర్ తండా, గాంధారి మండలం), బి.హీరాలాల్ ( మధుర తండా), నూనావత్ గణేశ్ ( కోల్పోల్, ముప్కాల్ మండలం) ఉన్నారన్నారు. దొంగల నుంచి 11 తులాల బంగారు నగలు, 22 తులాల వెండి, బైక్, 5 సెల్ఫోన్లు, రూ.8,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సదాశివనగ్ సీఐ సంతోష్, తాడ్వాయి, గాంధారి ఎస్సైలు నరేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు. దొంగల ముఠా సభ్యులను పట్టుకొవటంలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

