
సీఎం కేసీఆర్‌కి అమర వీరుల ఉసురు తగులుతుందని ప్రజా కవి గద్దర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలో గద్దర్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. గరీబ్ ప్రజల భూములను సీఎం కేసీఆర్ అన్యాయంగా లాక్కొని .. కోట్లకు పడగలు ఎత్తే కంపెనీలకు దానం చేస్తున్నారని విమర్శించారు. రైతుల భూముల జోలికి వస్తే ఖబర్ధార్ అని గద్దర్ హెచ్చరించారు. తెలంగాణలో భూమి పోరాటం మొదలైందని.. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ధరణి పేరుతో పేద ప్రజల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 25లక్షల భూమిని కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలన అంతమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.