Gaddar: ముగిసిన గద్దర్ అంత్యక్రియలు

Gaddar: ముగిసిన గద్దర్ అంత్యక్రియలు

విప్లవ వీరుడు గద్దర్(Gaddar) అంత్యక్రియలు ముగిశాయి. అల్వాల్ లోని మహాబోధి విద్యాలయంలో  ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. పోలీసులు గౌరవ వందనం చేసి..  గాల్లోకి మూడు రౌండ్ లు కాల్పులు  జరిపారు. భౌద్ద సంప్రదాయం ప్రకారం గద్దర్  అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

అంతిమ యాత్ర జరుగుతుండగా  సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ కార్డియాక్ అరెస్ట్ తో  కన్నుమూశారు. అంతిమ యాత్ర జరుగుతున్న వాహనం నుంచి దిగుతుండగా కిందపడిపోయారు. అదే సమయలో ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. అక్కడున్న వారు మంచినీళ్లు ఇచ్చి సీపీఆర్ చేయడానికి ప్రయత్నించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. 

గద్దర్(Gaddar) అంత్యక్రియలకు పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,  కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఇలా పార్టీలకతీతంగా నేతలు గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, అభిమానులు గద్దర్ ను చివరి చూపు చూడటానికి భారీగా తరలివచ్చారు.

అంతకుమందు గద్దర్(Gaddar) ఇంటి వద్ద ఆయన భౌతిక కాయానికి  సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు.  గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి  ప్రగాఢ సానుభూతి తెలిపారు.  కేసీఆర్ వెంట హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,  పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

 ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, గన్ పార్క్,  జేబీఎస్ మీదుగా అల్వాల్ వరకు గద్దర్ అంతిమ యాత్ర జరిగింది. 17కి.మీ మేర దాదాపు ఏడు గంటల పాటు అంతిమ యాత్ర జరిగింది.   అభిమానులు, కవులు కళాకారులు  భారీగా తరలివచ్చారు. రోడ్లన్ని కిక్కిరిసిపోయాయి.

ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ ఆగస్టు 6న  మధ్నాహ్నం తుదిశ్వాస విడిచారు.