
- ఆలంపూర్ బీసీ వెల్ఫేర్ స్కూల్ డిప్యూటీ వార్డెన్, సూపర్ వైజర్ సస్పెన్షన్
- ప్రిన్సిపాల్, వార్డెన్, హౌస్ మాస్టర్ కు మెమోలు జారీ
- బిల్డింగ్ ఓనర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూ ర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థుల కాలినడకపై స్పందిస్తూ.. కలెక్టర్ సంతోష్ సీరియస్ అయ్యారు. ఆ స్కూల్ డిప్యూటీ వార్డెన్ రజితను, సూపర్ వైజర్ నవీన్ ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్, వార్డెన్, హౌస్ మాస్టర్ కు మెమోలు ఇచ్చారు. పాఠశాలలోని సమస్యలపై స్టూడెంట్లు బుధవారం కాలినడకన కలెక్టరేట్ కు వెళ్లడంపై ఆయన స్పందించారు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి స్టూడెంట్లతో మాట్లాడి.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల భద్రతపై, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినచర్యలు ఉంటాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని కలెక్టర్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. స్టూడెంట్లపై బెదిరింపులకు పాల్పడుతున్న స్కూల్ బిల్డింగ్ ఓనర్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. స్కూల్ లో ప్రస్తుతం ఉన్న నాలుగు మరుగుదొడ్లను వినియోగించుకోవాలని, నెల రోజుల్లో కొత్త బాత్రూమ్ లు, మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే తిరిగి పంపి మంచివి తెప్పించుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. స్కూల్లో ఆర్వో ప్లాంట్ రిపేర్ కాగా.. వెంటనే మినరల్ వాటర్ అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఉండవల్లి మండలం కలుగొట్లలోని కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ స్టూడెంట్ కు పాముకాటు అనుమానంతో ఆస్పత్రికి తరలించిన ఘటనపై ఆమెతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.