గద్వాల/అయిజ, వెలుగు: అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయకపోవడం, లీవ్ లెటర్ ఇవ్వకుండా డ్యూటీకి డుమ్మా కొట్టడం, అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి డ్యూటీ చేయకుండా వెళ్లిపోయిన వైద్య సిబ్బందిపై గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సీరియస్ అయ్యారు. ఒకరిని సస్పెండ్ చేయడంతో పాటు 9 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ డీఎంఅండ్ హెచ్ వో కిరణ్మయిని ఫోన్ లో ఆదేశించారు. శుక్రవారం అయిజ పీహెచ్ సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అటెండెన్స్ రిజిస్టర్ ని పరిశీలించగా కొందరు సంతకాలు చేయకపోవడం, లీవ్ లెటర్ లేకుండా డ్యూటీకి రాకపోవడం, సంతకాలు చేసి డ్యూటీ చేయకుండా వెళ్లిపోయారని గుర్తించి వారిపై సీరియస్ అయ్యారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలు అపశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తంచేశారు. అనంతరం ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని, గ్యాస్ ఏజెన్సీని, కేజీబీవీ స్కూల్ ను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
మున్సిపల్ మేనేజర్, వార్డు ఆఫీసర్ కు షోకాజ్ నోటీసులు
చిన్నచింతకుంట : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ఫొటోలు దశల వారీగా యాప్ లో అప్లోడ్ చేయడం లో నిర్లక్ష్యం చేసిన దేవరకద్ర మున్సిపాలిటీ మేనేజర్, 7వ వార్డు అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని మహబూబ్నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం దేవర కద్ర పట్టణం లో 7 వార్డులో ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు.7వ వార్డులో నిర్మాణం పూర్తి అయిన ఇండ్లకు నాల్గవ విడత డబ్బులు రాలేదని లబ్ధిదారులు తెలిపారు.
సంబంధిత వార్టు ఆఫీసర్ టెక్నికల్ సమస్య ఉందని మున్సిపల్ కమిషనర్ ను తప్పు దోవ పట్టించి అప్లోడ్ చేయడంలో సుమారు నెల రోజుల నుంచి డిలే చేయడాన్ని కలెక్టర్ గమనించారు. యాప్ లో టెక్నికల్ సమస్య లేదని తేలడంతో ఆమె సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
