అయిజ, వెలుగు : క్లాస్ రూమ్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ కాంట్రాక్టర్ స్కూల్‌కు తాళం వేశాడు. వివరాల్లోకి వెళ్తే... రమేశ్ అనే కాంట్రాక్టర్ నాలుగేండ్ల కింద గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్ర పాడు జడ్పీహెచ్ఎస్‌లో అదనపు క్లాస్ రూంను నిర్మించాడు.
ఈ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో బుధవారం ఉదయం స్కూల్‌కు వచ్చి స్టూడెంట్లను బయటకు పంపించి తాళం వేశాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మహేశ్వరి కాంట్రాక్టర్‌కు ఫోన్ చేయగా.. తనకు సుమారు రూ.20 లక్షలు రావాల్సి ఉందని, బిల్లు మంజూరు కాకపోవడంతో వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లి బిల్లు చెల్లించేలా కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇవ్వడంతో తాళం ఓపెన్ చేశాడు. దీంతో స్టూడెంట్లు క్లాస్‌రూంలోకి వెళ్లిపోయారు.
