V6 News

నా టార్గెట్‌ పది మంది 

నా టార్గెట్‌ పది మంది 
  • ఒలింపిక్‌ మెడలిస్టులు:గగన్‌

 హైదరాబాద్‌‌‌‌,వెలుగు:పారిస్‌‌ వేదికగా 2024లో జరిగే ఒలింపిక్స్‌‌లో పది మంది షూటర్లను ఒలింపిక్‌‌ మెడలిస్టుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇండియా లెజెండరీ షూటర్‌‌, కోచ్‌‌ గగన్‌‌ నారంగ్‌‌ తెలిపాడు. ఆ టార్గెట్‌‌తోనే తన గన్‌‌ ఫర్‌‌ గ్లోరీ అకాడమీలో ‘ప్రాజెక్ట్‌‌ లీప్’ను ప్రారంభించానని తెలిపాడు.  ఇటీవల జరిగిన బధిరుల ఒలింపిక్స్‌‌లో రెండు గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించిన తన స్టూడెంట్‌‌ ధనుశ్‌‌ శ్రీకాంత్‌‌, జూనియర్‌‌ వరల్డ్‌‌కప్‌‌లో సిల్వర్‌‌ గెలిచిన సురభి భరద్వాజ్‌‌ను గగన్‌‌ శనివారం తిరుమలగిరిలోని తన అకాడమీలో సన్మానించాడు. ఈ ఇద్దరూ ఈ స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని తెలిపాడు. ‘చెవిటి, మూగ అయిన శ్రీకాంత్‌‌ 2016లో తొలిసారి మా అకాడమీకి వచ్చాడు. అతనికి కోచింగ్‌‌ ఇవ్వడం మాకు పెద్ద సవాల్‌‌గా మారిందన్నాడు.  కోడ్‌‌ లాంగ్వేజ్‌‌ నేర్చుకొని అతనికి గైడెన్స్‌‌ ఇచ్చాము. అలాగే, 2003లో నేను జూనియర్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో సిల్వర్‌‌ నెగ్గా. ఇప్పుడు సురభి కూడా అదే ఫలితాన్ని అందుకోవడం సంతోషంగా ఉంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌‌లో 10 మంది ఒలింపిక్ పతక విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా ఐదేళ్ల కిందట నేను  ‘ప్రాజెక్ట్ లీప్’ ప్రారంభించా. సత్తా ఉన్న షూటర్లను గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నా. దానికి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ మా లక్ష్యానికి మద్దతు ఇస్తుంది కాబట్టి  పారిస్ ఒలింపిక్స్‌‌లో మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నా’ అని గగన్‌‌ పేర్కొన్నాడు.