గజ్వేల్, వెలుగు: ప్రభుత్వ హాస్టల్లో ఉండి స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గజ్వేల్ పట్టణంలో జరిగింది. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం తునికి గ్రామానికి చెందిన మధుప్రియ (10) గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ బీసీ హాస్టల్ లో ఉంటూ జడ్పీహైస్కూల్లో ఆరో తరగతి చదువుతోంది.
హాస్టల్లో ఉండడం ఇష్టంలేక సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో అక్కడి వాష్ రూమ్ లో ఉన్న కాలం చెల్లిన హ్యాండ్ వాష్ ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్ కు విషయాన్ని చెప్పారు.
స్పందించిన వార్డెన్ హాస్టల్స్ సిబ్బందితో కలిసి ఆమెను గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
