- మూడో రోజూ ప్రశ్నించిన ఏసీబీ
- బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసేందుకు చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సీ హరిరాం కస్టడీ కొనసాగుతున్నది. ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు మూడో రోజైన ఆదివారం ఆయన్ను ప్రశ్నించారు. శుక్రవారం నుంచి మంగళవారం వరకు హరిరామ్‌ను ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కస్టడీలో భాగంగా ఆదివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీలో తీసుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.
రెండు రోజుల కస్టడీలో అడిగిన ప్రశ్నలకు కొనసాగింపుగా మరికొన్ని ప్రశ్నలు అడిగారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.. వాటి కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. సోదాల్లో భాగంగా గుర్తించిన బ్యాంకు లాకర్లను తెరిపించేందుకు చర్యలు ప్రారంభించారు. కోర్టు అనుమతితో సోమవారం బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం ఉంది. వాటిని ఓపెన్ చేస్తే మరికొన్ని కీలక పత్రాలు, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. లాకర్లలోనూ ఏవైనా ఆస్తుల పత్రాలు లభిస్తే వాటి ఆధారంగా కూడా హరిరామ్‌ను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.
