సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్కు షాక్.. గాలి అనిల్ కుమార్ రాజీనామా

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్కు షాక్.. గాలి అనిల్ కుమార్ రాజీనామా

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన సేవలు పార్టీ గుర్తుంచలేదనే మనస్తాపంతో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన భవిష్యత్తు కార్యాచరణను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానని ప్రెస్ మీట్ లో తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఐదు సంవత్సరాలుగా కష్టపడ్డానని, అయితే.. సముచిత స్థానం దొరకలేదన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం చాలా పని చేశానని, బీసీలకు  పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. ఐదేళ్ల క్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. 

నేషనల్ పేపర్స్ కు యాడ్స్ ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతో పాటు తనకు కూడా ఈడీ నోటీసులు అందాయన్నారు. ఇంత జరిగినా రాష్ట్ర నాయకత్వం తమను పలకరించలేదని వాపోయారు. అందుకే తీవ్ర మనస్తాపంతో కాంగ్రెస్ కు, పార్టీ పదవులకు రాజీనామ చేస్తున్నట్లు చెప్పారు. రాజీనామా లేఖను ఏఐసీసీ ఇన్ చార్జ్ ఖర్గేకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.