
లండన్: సుదీర్ఘ విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల ఫ్యామిలీని ఎక్కువ రోజులు అనుమతించొద్దన్న బీసీసీఐ రూల్‌ను టీమిండియా చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్థించాడు. ప్లేయర్లు ఇక్కడికి సెలవుల కోసం రాలేదని, దేశం కోసం ఆడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఇండియా 1–3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో బీసీసీఐ ఈ రూల్‌ను తీసుకొచ్చింది. 45 రోజుల కంటే ఎక్కువ రోజులు సాగే టూర్లలో ప్లేయర్లు ఫ్యామిలీతో కలిసి గరిష్టంగా రెండు వారాలు ఉండొచ్చు. చిన్న టూర్లలో ఈ వ్యవధిని ఏడు రోజులకు పరిమితం చేసింది.
‘క్రికెటర్ల జీవితాల్లో కుటుంబాల పాత్ర కూడా ప్రధానమైందే. కానీ ఇక్కడ ఓ విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఓ ప్రయోజనం కోసం ఇక్కడ ఉన్నారు. హాలీడేస్ కోసం రాలేదు. దేశం తరఫున ఆడుతున్నారు. డ్రెసింగ్ రూమ్ లేదా దేశం గర్వపడేలా చేసే అతి గొప్ప అవకాశం లభించిన వ్యక్తుల్లో మీరు ఉన్నారు’ అని గౌతీ వివరించాడు. కుటుంబాలతో కలిసి ఉంటే ప్లేయర్లలో ఒత్తిడి తగ్గుతుందని గతంలో విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే అన్నింటికంటే దేశాన్ని ముందుంచడమే అధిక ప్రాముఖ్యత అని గంభీర్ స్పష్టం చేశాడు. .‘కుటుంబం మనతో ఉండటాన్ని నేను వ్యతిరేకించడం లేదు.
కానీ సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవాలి. మీ దృష్టి దేశాన్ని గర్వపడేలా చేయడంపై ఉంటే ఇతర ఏ విషయాలు మీకు పెద్దవి అనిపించవు. అప్పుడు మీరు లక్ష్యానికి కట్టుబడి ఉంటారు. ఆ టైమ్‌లో మిగతా విషయాలు కూడా బాగానే ఉంటాయని నేను భావిస్తా’ అని చీఫ్ కోచ్ పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు వేరే విషయాలపై దృష్టి పెట్టడం చాలా కష్టమన్నాడు. బర్మింగ్‌హామ్‌లో ఇండియా గెలిచిన కొన్ని నిమిషాల తర్వాత తాను తర్వాతి మ్యాచ్ టీమ్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నానని వెల్లడించాడు.