ప్రముఖ టీవీ సిరీస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ కన్నుమూశారు. కేవలం 35 ఏళ్ల వయసులోనే, నరాల సమస్యతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త అభిమానులను విషాదంలో ముంచేసింది. పాట్రిక్ మరణాన్ని ఆయన భార్య నయోమీ షీహాన్ ధృవీకరించారు. బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి రోజు ఫోటోను పంచుకుంటూ ఆమె ఎమోషనల్ అయింది.
భార్య భావోద్వేగ నివాళి..
“మంగళవారం రాత్రి ఏప్రిల్ 7, 2026న మైఖేల్ ఉత్తర ఐర్లాండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 2023 ఫిబ్రవరి 1న ఆయనకు మోటర్ న్యూరోన్ వ్యాధి నిర్ధారణ అయింది. 10 రోజుల క్రితం ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించాము. అక్కడి వైద్య బృందం ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ప్రశాంతంగా ఆయన ప్రాణాలు విడిచారు.” అని భార్య నయోమీ తెలిపింది.
ఆమె తన భర్తపై ప్రేమను వ్యక్తం చేస్తూ,“మా మనసులోని బాధను మాటల్లో చెప్పలేం. మిక్‌ను కలిసిన ప్రతి ఒక్కరికీ ఆయన ఒక ప్రేరణ. ఆయన జీవితం ఆనందం, ఉత్సాహం, నవ్వులతో నిండిపోయింది,” అని ఎమోషనల్ పదాలతో పోస్ట్ చేసింది.
మోటర్ న్యూరోన్ వ్యాధి (MND):
నటుడు మైఖేల్ చాలా కాలంగా మోటర్ న్యూరోన్ వ్యాధి (Motor Neurone Disease - MND)తో పోరాడుతున్నారు. ఈ వ్యాధి 2023 ఫిబ్రవరిలో ఆయనకు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి క్రమంగా తీవ్రతరం అవుతూ శ్వాస, మింగడం, మాట్లాడటం, కదలిక వంటి ముఖ్యమైన శరీర క్రియలను ప్రభావితం చేస్తుంది. ఇక పరిస్థితి పూర్తిగా విషమించడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మైఖేల్ కన్నుముశారు.
ఈ క్రమంలోనే మైఖేల్ భార్య తన పోస్టులో ప్రముఖ ఐరిష్ కవి బ్రెండన్ బాహిన్ చెప్పిన కోట్‌ను ప్రస్తావించారు. “ప్రపంచంలో ముఖ్యమైనవి..తినడం, తాగడం, మనలను ప్రేమించే ఎవరో ఒకర్ని కలిగి ఉండటం. కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి. తినండి. తాగండి. ప్రేమించండి.” అంటూ తెలిపింది. ఈ సంఘటన సినీ ప్రపంచాన్ని మరియు అభిమానులను తీవ్రంగా కలచివేసింది.
వైద్య సహాయం కోసం నిధుల సేకరణ
2025 నవంబర్‌లో, మైఖేల్ పాట్రిక్ స్నేహితులు కలిసి ఆయన వైద్య చికిత్స మరియు సంరక్షణ కోసం GoFundMe ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనకు అవసరమైన ట్రాకియోస్టమీ (tracheostomy) చికిత్సతో పాటు, ఆ తర్వాత అవసరమయ్యే ప్రత్యేక వైద్య సేవల కోసం ఈ నిధులు అత్యవసరంగా మారాయి. ఈ క్రమంలోనే ఫండ్స్ కల్లెక్ట్ చేసి తమ స్నేహాన్ని చాటుకున్నారు.
ట్రాకియోస్టమీ అనేది మెడ ముందు భాగంలో చిన్న గొట్టాన్ని అమర్చే వైద్య విధానం. దీని ద్వారా శ్వాస తీసుకోవడం సులభమవుతుంది, ముఖ్యంగా శ్వాసకోశ కండరాలు బలహీనపడిన సందర్భాల్లో ఇది కీలకంగా సహాయపడుతుంది. అయితే, ఈ చికిత్స తర్వాత రోగికి నిరంతర పర్యవేక్షణ మరియు నిపుణుల సంరక్షణ అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో, శ్వాసనాళం సురక్షితంగా ఉండేందుకు మరియు కొత్త పరిస్థితికి రోగి అలవాటు పడేందుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది.
అయితే, ప్రజల సహకారంతో ఈ నిధుల సేకరణ విజయవంతమై, చివరకు కావాల్సిన మొత్తాన్ని సేకకరించగలిగారు. కానీ, పరిస్థితి పూర్తిగా చేజారడంతో మైఖేల్ ని బతికించడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.
