గేమింగ్​ ఇండస్ట్రీ భవిష్యత్​ భేష్​ .. గ్రాంట్ థోర్న్‌‌టన్ రిపోర్ట్​ వెల్లడి

గేమింగ్​ ఇండస్ట్రీ భవిష్యత్​ భేష్​ ..  గ్రాంట్ థోర్న్‌‌టన్ రిపోర్ట్​ వెల్లడి
  • దీని విలువ 2025 నాటికి రూ. 23,100 కోట్లకు 

న్యూఢిల్లీ: భారతీయ ఆన్​లైన్​ గేమింగ్ పరిశ్రమ 20 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 23,100 కోట్లకు చేరుకోనుందని మంగళవారం ఒక నివేదిక తెలిపింది.  భారతదేశంలో ఆన్‌‌లైన్ గేమర్‌‌ల సంఖ్య చైనాను అధిగమించి 442 మిలియన్ల డాలర్లకు చేరనుందని  గ్రాంట్ థోర్న్‌‌టన్, భారత్  ఈ–-గేమింగ్ ఫెడరేషన్‌‌ల రిపోర్ట్​ వెల్లడించింది.  గేమింగ్ పరిశ్రమ కోసం సమగ్ర ప్రవర్తనా నియమావళి ఉండాలని సిఫార్సు చేసింది.

  జవాబుదారీతనం,  పారదర్శకత, నైతికత ఉండేలా చేయడానికి స్పష్టమైన ప్రమాణాలను సూచించింది.  ఈ రిపోర్టు ప్రకారం.. భారతదేశంలోని  గేమింగ్ ఇండస్ట్రీకి యువ జనాభాతో ఎంతో మేలు జరుగుతోంది. ఫలితంగా భారీ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో, భారతీయ గేమింగ్ దేశీయ  ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి  2.8 బిలియన్ల డాలర్లను సేకరించింది.      

ఆర్​ఎంజీ దూకుడు..

రియల్ మనీ గేమింగ్ విభాగం (ఆర్​ఎంజీ) పరిశ్రమకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులు వారానికి సగటున 8.5 గంటలు ఆన్​లైన్​ గేమింగ్​ కోసం గడిపినట్టు తేలింది.   భారతదేశంలోని ఆర్​ఎంజీ రంగం 2023లో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ప్రభుత్వం ఆర్​ఎంజీపై 28 శాతం జీఎస్టీ విధించడాన్ని సంబంధిత కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

పన్ను భారం తట్టుకోలేక కొన్ని స్టార్టప్‌‌లు మూతబడ్డాయి. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, ఆర్​ఎంజీకి మార్కెట్​ఆదాయంలో ఇప్పటికీ 83-–84 శాతం వాటా ఉంది. ప్రతిరోజూ సుమారు 100 మిలియన్ల మంది ఆన్‌‌లైన్ గేమర్‌‌లు ఆడటానికి 90 మిలియన్ల డాలర్లు చెల్లిస్తున్నారు. ఆర్​ఎంజీ ఇక నుంచి కూడా మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  28 శాతం జీఎస్టీ విధింపు తర్వాత కూడా, పెట్టుబడిదారుల సెంటిమెంట్ పరిశ్రమలో బలంగా ఉంది. గేమింగ్​వృద్ధికి జీఎస్టీ అడ్డంకి కాబోదని ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​అంటున్నారు. ఆర్​ఎంజీలో భారీ ఎత్తున డీల్స్​ జరుగుతుండటమే ఇందుకు నిదర్శమని చెబుతున్నారు.  

ప్రమాణాలు కీలకం

గేమింగ్​ ఇండస్ట్రీకి ప్రమాణాలు విధించడం వల్ల సైబర్ బెదిరింపులు, నియంత్రణ సమస్యలు,  ఆర్థిక నష్టాలు వంటి సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రాంట్ థోర్న్‌‌టన్ రిపోర్ట్ పేర్కొంది. ప్రమాణాలు సరిగ్గా అమలు కావడానికి థర్డ్​పార్టీ సర్టిఫికేషన్​కూడా అవసరమని స్పష్టం చేసింది. గేమింగ్ ​ఇండస్ట్రీ సురక్షితంగా ఉండాలంటే కంపెనీలు, రెగ్యులేటర్లు, పాలసీమేకర్ల మధ్య సత్సంబంధాలు ఉండాలని సూచించింది. మోసాల నుంచి కంపెనీలకు రక్షణ ఉండాలంటే రెగ్యులేటరీ సిస్టమ్​ బలోపేతం కావాలని స్పష్టం చేసింది.