Ganesh Chaturdhi 2025: గణపతి నవరాత్రి పూజల విశిష్టత.. ఏ రోజు ఏ అవతారాన్ని పూజించాలి..

Ganesh Chaturdhi 2025: గణపతి నవరాత్రి పూజల విశిష్టత.. ఏ రోజు ఏ అవతారాన్ని పూజించాలి..

దేశ వ్యాప్తంగా ప్రతి పల్లెలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి  ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా, శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది. గణపతి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవాతర వినాయకుడిని ఆవాహన చేయాలి... దాని విశిష్టత ఏంటి..  అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం....

ఒకటవ రోజు ( భాద్రపద శుద్ధ చవితి) ఆగస్టు 27 :   ఆ ఆరోజున వినాయక నవరాత్రిళ్లు ప్రారంభమవుతాయి.  వరాలు కురిపించే వరసిద్ది వినాయకుడిని పూజించాలి.  మొదటి రోజున స్వామికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుడిని పూజించిన తరువాత  శమంతక ఉపాఖ్యానం కథ వినాలి.   చవితినాటి చంద్రుడిని  చూసినవారికి నీలాపనిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడటం కోసం ఈ కథ చదువుకుని అక్షతలు తలమీద వేసుకోవాలి. అక్షతలను మనమే ధరించాలి తప్ప, భగవంతుడిపై వేయకూడదు. కేవలం నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు  ఈ కథను వింటే సరిపోతుందని పండితులు చెబుతున్నారు. 

2వ రోజు(భాద్రపద శుద్ధ పంచమి) ఆగస్టు 28:  వినాయక నవరాత్రిళ్లలో రెండవ రోజు  వికట వినాయకుడిని పూజించాలి. లంబోదరశ్చ వికటో.. విఘ్నరాజో గణాధిప: ' అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి.

3వ రోజు (భాద్రపద శుద్ధ షష్ఠి) ఆగస్టు 29...  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మూడో  రోజున లంబోదర అవతారాన్ని ఆవాహన చేసిన  పూజ చేయాలి.   లంబోదర వినాయకుడిని పూజించి పేలాలను నైవేద్యంగా సమర్పించాలి.  క్రోధాసురుడిని  వధించిన లంబోదరుడిని మూడోనాడు షోడశోపచారాలతోనూ, అష్టోత్తర శతనామావళితో గానీ, సహస్ర నామావళితోనూ పూజించాలి.. 

4వ రోజు (భాద్రపద శుద్ధ సప్తమి)ఆగస్టు 30  .. వినాయక నవరాత్రిళ్లలో  నాలుగోరోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడయిన గజాననుడికి చెరకుగడను నివేదన చేయాలి.  లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయ వరాలు పొందుతాడు. దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైభ్యుడనే మునిని ఆశ్రయిస్తారు. ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు. వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు. 

5వ రోజు ( భాద్రపద శుద్ధ అష్టమి) ఆగస్టు 31:   గణపతి నవరాత్రిళ్లలో ఐదవరోజున మహోదర వినాయకుడిని పూజించి నివేదనగా కొబ్బరి కురిడిని సమర్పించాలి. శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియశిష్యుడు ఉండేవాడు. గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి, మహాశక్తిమంతుడిని చేశాడు. అతను మదిర అనే రాక్షసకన్యను పెండ్లాడతాడు. మూషికాసురుడు మోహాసురుడిని గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. ముందుగా తన చెరనుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెబుతాడు. సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్లి, ప్రవాళ గణపతిని పూజిస్తాడు. గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు. భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు.

6వ రోజు (భాద్రపద శుద్ధ నవమి) సెప్టెంబర్​ 1  : ఏకదంత వినాయకుడిని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆరవరోజున పూజించి నువ్వులు/ నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. దేవతలు, రుషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలిచాడు. సింహం ఆ అసురునిపై లంఘించి, వాడి గొంతును నోట కరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణగి ఏకదంత గణపతిని శరణువేడాడు. గణపతి వాడికి అభయమిచ్చి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధిచెప్పి, పాతాళానికి పంపుతాడు. 

7వ రోజు( భాద్రపద శుద్ధ దశమి) సెప్టెంబర్​ 2 :  వక్రతుండ వినాయకుడిని ఏడవరోజు పూజించి అరటి పండ్లతో పాటు ఇతర రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. మూషికాసురుడు మత్సరాసురుడిని గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు. ఆ అసురుడు సింహరూపం పొంది, గణపతి మీదికి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడుతాడు.

8వరోజు  (భాద్రపద శుద్ధ ఏకాదశి)సెప్టెంబర్​ 3 : విఘ్నరాజ వినాయకుడిని ఎనిమిదవరోజు పూజించి సత్తుపిండిని నైవేద్యం పెట్టాలి. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి, ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విష వాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పంకూడా తొండంలో చొరబడింది. దానిని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి. గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పొలుసులు నుగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు, 'గణేశా! శరణు. నీకు సోదరుడను. ప్రాణభిక్ష పెట్టు' అంటూ ప్రాధేయపడటంతో గణపతి కరుణించాడు. 

9వ రోజు (భాద్రపద శుద్ధ ద్వాదశి) సెప్టెంబర్​ 4  :  ధూమ్రవర్ణ వినాయకుడిని చివరి రోజు తొమ్మిదవ రోజు ఆవాహన చేసి అర్చించి.. నేతి అప్పాలను నివేదనగా సమర్పించాలి. . ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు. దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి, స్వామి శరణాగతుడయ్యాడు. గణేశుని అర్చించే వారి జోలికి రానని చెప్పి, ధూమ్రవర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాళ లోకానికి వెళ్లిపోతాడు.