గాంధీ డాక్టర్ల ఘనత..51 ఏండ్ల మహిళకు పునర్జన్మ... మహిళకు విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి  

గాంధీ డాక్టర్ల ఘనత..51 ఏండ్ల మహిళకు పునర్జన్మ... మహిళకు విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి  
  • ఆర్టిఫిషియల్​ వాల్వ్​ అమర్చిన డాక్టర్లు 
  • పూర్తిగా కోలుకున్న రోగి 

పద్మారావునగర్, వెలుగు : తీవ్రమైన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న 51 ఏండ్ల మహిళకు గుండె, రక్తనాళాల శస్త్రచికిత్స విభాగం (సీటీవీఎస్​) డాక్టర్లు అత్యాధునిక సర్జరీ విజయవంతంగా నిర్వహించి శభాష్​అనిపించుకున్నారు. గాంధీ సూపరింటెండెంట్​ప్రొఫెసర్​ డా.తోట ఉషారాణి బుధవారం వివరాలు వెల్లడించారు. బోయిన్​పల్లికి చెందిన రాజమ్మకు గుండెలో కవాటం దెబ్బతినడంతో  రోజు ఎంత చిన్న పని చేసినా ఆయాసం, అలసటతో ఇబ్బంది పడేది. 

ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో ఆమె గాంధీ దవాఖానకు వచ్చింది. పరీక్షలు చేసిన డాక్టర్లు కవాటం (శరీరంలో రక్తం లేదా ఇతర లిక్విడ్స్​ఒకే దిశలో ప్రవహించేలా నియంత్రించే ఒక చిన్న తలుపు) దెబ్బతినడంతో సమస్య తీవ్రమైందని గుర్తించారు. గత నెల 30న సర్జరీ చేసి పాడైపోయిన గుండె వాల్వ్ స్థానంలో 27 మిల్లీమీటర్ల అత్యాధునిక మెకానికల్ ఆర్టిఫిషియల్​వాల్వ్‌‌‌‌ను విజయవంతంగా అమర్చారు. 

సర్జరీ చేసిన తర్వాత వెంటిలేటర్ తో పాటు కార్డియాక్ సపోర్టుతో ఐసీయూలో అబ్జర్వేషన్​లో ఉంచారు. మరుసటి రోజే వెంటిలేటర్ తొలగించారు. మెడికేషన్​తో ఆమె వేగంగా కోలుకున్నారు. 

తర్వాత నిర్వహించిన 2డీ ఎకో, కలర్ డాప్లర్ పరీక్షల్లో కృత్రిమ వాల్వ్ ఎటువంటి లీకేజీలు లేకుండా అత్యంత సాధారణంగా పనిచేస్తుందని, లెఫ్ట్ వెంట్రికల్ పనితీరు మెరుగ్గా ఉందని గుర్తించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో డిశ్చార్జి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఆపరేషన్‌‌‌‌ను సీటీవీఎస్​ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ జి. రవీంద్ర, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై. హర్షిత, సూపర్ స్పెషాలిటీ పీజీ డాక్టర్లు రాజశేఖర్, ఫణి కుమార్ శర్మలతో కూడిన టీమ్​చేసింది. 

వీరికి అనస్థీషియా విభాగం, పెర్ఫ్యూషన్ ఎక్స్​పర్ట్స్​(ఓపెన్​హార్ట్​సర్జరీ చేసేప్పుడు హార్ట్-లంగ్ మెషీన్ నడిపే ప్రత్యేక డాక్టర్లు సహకారాన్ని అందించారు. ప్రైవేటు దవాఖానలో సుమారు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అయ్యే ఈ సర్జరీ తాము చేయించుకునే స్థితిలో లేమని, ఒక్కపైసా ఖర్చు లేకుండా చేసిన గాంధీ దవాఖానకు రుణపడి ఉంటామని రాజమ్మ చెప్పింది.