పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖాన డాక్టర్లు అరుదైన, సంక్లిష్టమైన గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి 25 ఏండ్ల యువతికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్జరీ వివరాలను హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణితో కలిసి సీటీ సర్జరీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ రవీంద్ర బుధవారం మీడియాకు వివరించారు. ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి(25) పలు అనారోగ్య సమస్యలతో స్థానిక ఆస్పత్రిలో చేరగా, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు, అనంతరం గాంధీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండెదడతో బాధపడుతున్న ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా బార్డెట్–బీడిల్ సిండ్రోమ్(బీబీఎస్) అనే బహుళ అవయవాలను ప్రభావితం చేసే జన్యుపరమైన సమస్యతో పాటు పాలీడాక్టిలీ, కండరాల బలహీనత, , ఊబకాయం, మేథో వైకల్యం, టైప్–1 డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు.
అలాగే పుట్టుకతో గుండెలో రంధ్రం ఉంది. దీంతో ప్రొఫెసర్ రవీంద్ర నేతృత్వంలో సర్జరీ చేశారు. ఇది అత్యంత సవాల్‌తో కూడుకున్నదని సూపరింటెండెంట్ వాణి తెలిపారు. లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ సర్జరీని గాంధీ దవాఖానలో ఉచితంగా నిర్వహించామని పేర్కొన్నారు. సర్జరీ చేసిన రవీంద్రతో పాటు డాక్టర్లు రవి శ్రీనివాస్, ప్రశాంత్, రాజ్‌కుమార్, అనస్థీషియా డాక్టర్లు మురళీ, కిరణ్, శ్రేయ, సుచరిత, సాయిప్రసన్నలను ఆమె అభినందించారు. ఆర్‌ఎంఓలు శేషాద్రి, కళ్యాణ్ చక్రవర్తి, నవీన్, హసిత పాల్గొన్నారు.
