పద్మారావునగర్, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు గాంధీ హాస్పిటల్ డాక్టర్లు క్లిష్టమైన సర్జరీ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. భారీ ప్లీహవృద్ధి(స్ప్లీన్ పెరగడం), ప్యాన్సైటోపీనియా వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళపై అరుదైన స్ప్లీనెక్టమీ సర్జరీని విజయవంతంగా చేశారు. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన బాధితురాలు మూడు నెలలుగా కడుపునొప్పి, నెల రోజులుగా కడుపు ఉబ్బరం సమస్యలతో గాంధీ హాస్పిటల్‌ను ఆశ్రయించింది.
వైద్య పరీక్షల్లో ఆమె ప్లీహం భారీగా పెరిగి నాభి కింద వరకు విస్తరించినట్లు గుర్తించారు. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో ప్లీహం పరిమాణం 19×23 సెంటీమీటర్లుగా ఉండగా, రక్తంలో ఎర్ర, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తేలింది.
సీనియర్ సర్జన్ డాక్టర్ సునీల్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ మురళి ఆధ్వర్యంలోని వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసి.. 2.8 కిలోల బరువున్న భారీ ప్లీహాన్ని తొలగించారు. ఆమె క్రమంగా కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. వైద్యబృందాన్ని గాంధీ అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణి, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శోభ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా అభినందించారు.
