- గాంధీ హాస్పిటల్ డాక్టర్ల మరో ఘనత
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ సెంటర్ మరో సక్సెస్ సాధించింది. పదేళ్లుగా సంతాలేమితో బాధపడుతున్న దంపతుల్లో సంతోషం నింపింది. భువనగిరి జిల్లాకు చెందిన రవి, సౌమ్య దంపతులకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కలగకపోవడంతో వారు పలు ప్రైవేటు ఫర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించారు.
సుమారు 12 సార్లు ఓఐ, ఐయూఐ వంటి చికిత్సలు చేయించుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. గతేడాది గాంధీ ఆసుపత్రిలోని ఐవీఎఫ్ సెంటర్‌ను సంప్రదించారు. గాంధీ డాక్టర్లు వారి సమస్యను గుర్తించి ఐవీఎఫ్ ప్రక్రియ ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే చికిత్స విజయవంతమై సౌమ్య గర్భం దాల్చినట్లు గైనకాలజీ విభాగం డాక్టర్లు శోభ, ఫాతిమా తెలిపారు.
ఐవీఎఫ్ ప్రక్రియ నుంచి యాంటినాటల్ చెకప్స్, ఖరీదైన మందుల వరకు అన్నీ గాంధీ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందించారు. ఈ నెల 27న సౌమ్య గాంధీ ఆసుపత్రిలోనే 3.6 కిలోల బరువుతో ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసినా సాధ్యం కాని చికిత్స, గాంధీలో ఉచితంగా విజయవంతం కావడంతో దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గాంధీ ఐవీఎఫ్ యూనిట్ ను అభినందించారు. ఇప్పటివరకు గాంధీ ఐవీఎఫ్ యూనిట్ ద్వారా మూడు జంటలకు నలుగురు శిశువులు జన్మించారు.-
