పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి ఐవీఎఫ్ కేంద్రం సంతానలేమితో బాధపడుతున్న ఓ దంపతులకు సంతానం కలిగించింది. ఈ కేంద్రం ద్వారా నాలుగో ఐవీఎఫ్ కాన్పు నమోదైంది.
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎన్. వాణి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన గవ్వల సతీష్ (36), నవీన(31) దంపతులకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ చికిత్స అందిస్తున్నట్లు తెలుసుకుని గతేడాది ఇక్కడ సంప్రదించారు.
డాక్టర్లు 2025లో ఐవీఎఫ్ ప్రక్రియ చేపట్టారు. విజయవంతం కావడంతో నవీన గర్భం దాల్చింది. శుక్రవారం గాంధీ ఆసుపత్రిలోనే ఆమె 3 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా గాంధీలో ఇప్పటి వరకు నలుగురికి సంతానం కలిగింది.
