ఎబోలా ముప్పును తిప్పికొట్టేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధం

ఎబోలా ముప్పును తిప్పికొట్టేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధం
  • 25 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు
  • వైద్యారోగ్య శాఖ పూర్తి సన్నద్ధత.. రాష్ట్రంలో ఒక్క కేసూ నమోదు కాలేదని వెల్లడి
  • ఎన్‌‌‌‌సీడీసీ బృందం తనిఖీ.. ఏర్పాట్లపై సంతృప్తి

పద్మారావునగర్, వెలుగు:  అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్న ఎబోలా వైరస్ ముప్పును తిప్పికొట్టేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ సన్నద్ధమైంది.  రాష్ట్ర నోడల్ కేంద్రం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఏడో అంతస్తులో ఎనిమిది ప్రత్యేక గదులతో 25 బెడ్లతో కూడిన 10 ఐసోలేషన్, 15 క్వారంటైన్ వార్డును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు వైద్యసేవలందించే సిబ్బంది కోసం పీపీఈ కిట్లను రెడీ చేశారు. ప్రస్తుతం దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ ఒక్క ఎబోలా  కేసు నమోదు కాలేదని ఎబోలా స్టేట్ నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ సునీల్‌‌‌‌కుమార్ స్పష్టం చేశారు.

మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ టెస్ట్​లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గబ్బిలాల ద్వారా, కేవలం శరీర ద్రవాల (బాడీ ఫ్లూయిడ్స్) ద్వారా అంటే.. రక్తం, మూత్రం, మలం, లాలాజలం, ఎంగిలి, ఓరల్ సెక్స్ వంటివి ఈ వైరస్​వ్యాప్తికి ప్రధాన కారణాలు అని తెలిపారు. ఈ వైరస్ సోకితే.. తీవ్ర జ్వరం, డయేరియా, గొంతునొప్పి, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు పేర్కొన్నారు.

అనుమానిత లక్షణాలున్న వారికి ఆర్‌‌‌‌టీపీసీఆర్, ఎలిషా పరీక్షలు చేసి, నమూనాలను తుది నిర్ధారణ కోసం పూణేలోని 'ఎన్‌‌‌‌ఐవీ' ల్యాబ్‌‌‌‌కు పంపుతామన్నారు.  ఒకవేళ ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారు 21 రోజుల పాటు హోం ఐసోలేషన్‌‌‌‌లో ఉండాలని, ఆ తర్వాతే వ్యాధి లక్షణాలు  బయటపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారుల సలహాలు, సూచనల మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి నేతృత్వంలో నోడల్ సెంటర్‌‌‌‌లో అన్ని రకాల అత్యవసర వసతులను కల్పించామన్నారు. వైద్యులతో పాటు నర్సింగ్, శానిటేషన్ సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.   

సెంట్రల్ టీమ్​ గాంధీ ఎబోలా వార్డుల విజిట్..

గాంధీ ఆసుపత్రిలోని ఎబోలా వార్డులను నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ (ఎన్‌‌‌‌సీడీసీ) సెంట్రల్ కమిటీ ప్రతినిధులు ప్రవీణ్ మాదల, రాహుల్ గార్డ్, వరుణ్‌‌‌‌ల బృందం శుక్రవారం పరిశీలించింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి, నోడల్ అధికారి సునీల్‌‌‌‌కుమార్‌‌‌‌లతో సమావేశమై వైరస్ నివారణ చర్యలపై చర్చించింది. ఇక్కడి వసతులు, వైద్య సౌకర్యాలపై కేంద్ర బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేసింది. ఆసుపత్రిలో ఐసోలేషన్ బెడ్లు, క్వారంటైన్ బెడ్లతోపాటు పీపీఈ కిట్లు, ఇతర వైద్య సౌకర్యాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఇక్కడి ఏర్పాట్లపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. కార్యక్రమంలో జనరల్‌‌‌‌మెడిసిన్‌‌‌‌అసోసియేట్‌‌‌‌ప్రొఫెసర్‌‌‌‌ వంశీకృష్ణ  పాల్గొని కేంద్ర బృందానికి ఏర్పాట్లను వివరించారు.